ముట్టుకోకుండా వేసే స్విచ్‌లు…. మనిషి వెళ్లగానే తెరుచుకునే తలుపులు…. ఆటోమేటిక్ కిటికీలు, వాటికి వేలాడే తెరలు… ట్యాప్ తిప్పకుండా తాగేందుకు వీలుగా నల్లాలు…. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా..!!
కరోనా ప్రభావం నిర్మాణ రంగం చూపనున్న ప్రభావం ఇదంతా..! అవును కరోనావైరస్ కారణంగా ఇప్పుడు ఒకరికి ఒకరు తాకే పరిస్థితి లేదు.. కనీసం ఒకరు తాకిన స్విచ్‌లు, తలుపుల హ్యాండిల్స్ మరొకరు తాకేందుకు భయపడుతున్న పరిస్థితి. లిఫ్టులో బటన్ల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదనుకుంటా. ఇప్పటికే బటన్లను టూత్‌పిక్‌లు, పెన్నులు వంటి సాయంతో నొక్కుతున్నారు. ఇవన్నీ ఏమోగానీ, కరోనా వచ్చాక నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. నిర్మాణాలు నిలిచిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందల కోట్ల నష్టాలు చవి చూస్తున్నారు.
నిర్మాణాలు ఎప్పటికీ మొదలై పూర్తవుతాయో తెలియకుండా మారింది. ఈ ప్రభావం కూడా ఏ ఒక్క ప్రాంతానికో పరిమిత కాలేదు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు, ఎక్కడ చూసిన నిలిచిపోయిన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఆఫీసులకు కడుతున్న భవనాలు. ఇళ్లు, అపార్టమెంట్లు….. ఇలా ప్రతి నిర్మాణమూ ఆగిపోయింది. ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణాల్లో మార్పులు తీసుకురావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భవన నిర్మాణాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇక నుంచి ఇళ్ల నిర్మాణ సమయంలో ఆటోమేటిక్‌గా పనిచేసే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
తలుపులు తీయాలంటే తాకకుండా తీసేలా ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఎక్కువగా అందుబాటులోకి రానున్నాయి. ఇళ్లు, కార్యాలయాల్లో ఆటోమేటిక్ ఆన్/ఆఫ్ స్విచ్‌లు రానున్నాయి. మనిషి ఉన్నప్పుడు వెలిగేలా.. లేనప్పుడు ఆరిపోయేలా ఉండేలా లైట్లు రానున్నాయి. దీనివల్ల ఒకరు తాకిన స్విచ్‌లను మరొకరు తాకకుండా ఉండేందుకు వీలవుతుంది.
కార్యాలయాలలోనూ నీటిని తాగేందుకు ట్యాప్‌లకు బదులుగా ఫౌంటెయిన్ తరహా నల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే అమెరికాలో నీరు తాగేందుకు ఇదే తరహాలో నీటి ట్యాప్‌లు కుళాయిలు, పబ్లిక్ స్థలాల్లో ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలోనూ వీటికి డిమాండ్ పెరగనుంది. ఈ తరఙా ట్యాప్‌లను శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువచ్చారు
ఇళ్లు, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు అనేది చాలా కీలకంగా మారింది. కరోనావైరస్ వచ్చాక ఇప్పుడు కెమెరాలు థర్మల్ స్క్రీనింగ్ అప్షన్‌తో పనిచేసేవి ఏర్పాటు చేసేందుకు యజమానులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వీలుంది. భవన నిర్మాణదారులు దీనికి అనుగుణంగా కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఇంటికి లేదా కార్యాలయాలకు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఎంత టెంపరేచర్ ఉందో గ్రహించి ఫీవర్ ఉంటే గుర్తించి వెనక్కి పంపించేందుకు వీలవుతుంది.
అంతేకాదు ఇప్పటికే స్పెయిన్, ఇటలీలో భవనాలకు దుమ్ముధూళి నిలవకుండా ఉండేలా ప్రత్యేకమైన రంగులు వేస్తున్నారట. మురుగునీటి వ్యవస్థ డిజైన్లోనూ భారీ మార్పులు తీసుకువస్తున్నారు. డ్రైనేజీ నీరు ఆధారంగా వైరస్ల జాడ గుర్తించేందుకు వీలుగా వ్యవస్థలు ఉంటాయని సమాచారం.
ఇలా ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ తర్వాత కాలంలో భారీగానే మార్పులు రానున్నాయి. టెక్నాలజీ వాడుకుని నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపుతున్నారు. అలాంటి భవనాలకే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందనడంలోనూ సందేహం లేదు.