న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గత పది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. గత మూడు రోజులుగా ప్రతి రోజు 16వేలకు తక్కువ కాకుండా నమోదు అవుతున్నాయి.
కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా ఎందుకు పెరుగుతున్నాయనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. కేసుల తీవ్రత అధికంగా ఉన్న రాస్ట్రాలలో వైరస్ నిర్థారణ పరీక్షలు పెంచాలని కేంద్రం ఇప్పటికే ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం విధిగా పాటించేలా చూడాలని, వీలైనంత మేరకు వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో 8333 కేసులు, పంజాబ్ లో 622, కేరళలో 3671 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో కొత్త కేసులు పెరిగాయి.