FbTelugu

కరోనాకు బ్లాక్ ఫంగస్ తోడయ్యింది: సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూ కరోనాను కట్టడి చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సిఎం సూచించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, వాక్సినేషన్, లాక్ డౌన్ అమలు పై సోమవారం ప్రగతిభవన్ లో కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ప్రాథమిక వైద్య కేంద్రాల వద్దకు వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలు పెంచేందుకు వీలుగా తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని ఆదేశించారు. వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సిఎం సృష్టం చేశారు.

తక్షణమే రాష్ట్రంలోని డిఎంహెచ్ఓలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి నియమాకాల  ప్రక్రియ గురించి, దవఖానాల్లో మందులు తదితర మౌలిక వసతుల అవసరాల గురించి అడిగి తెలుసుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును ఆదేశించారు. లాక్ డౌన్  నేపధ్యంలో కొన్ని శాఖల ఖర్చు పెరుగుతుందని, కొన్ని శాఖల ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఖర్చు పెరిగే అవకాశాలున్న పోలీస్, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్ ను పెంచాలని, దీనిపై సమీక్ష నిర్వహించాలని మంత్రి హరీష్ రావును కోరారు. రాష్ట్రంలో అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని, ఆక్సిజన్ ఉత్పత్తిని 600 ఎంటీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతంగా కరోనాను కట్టడి చేస్తున్నదని తెలుస్తున్నది. మహారాష్ట్ర కూడా కరోనాను కట్టడి చేయడంలో సత్ఫలితాలను సాధిస్తున్నది. ఇంకా ఏ ఏ రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నవి తెలుసుకోవాలన్నారు. అందుకు వారు అమలు పరుస్తున్న కార్యాచరణ  ఏంటో తెలుసుకునేందుకు ఆ రాష్ట్రాలకు వెళ్లిరావాలని వైద్య శాఖను సిఎం ఆదేశించారు.

బ్లాక్ ఫంగస్ చికిత్సకోసం సికింద్రాబాద్ గాంధీలో 150 బెడ్లను, కోఠి ఈ.ఎన్.టి ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం కలిపి 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు వివరించారు. మెహిదీపట్నం సరోజినీ దేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను అదనంగా వెంటనే ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. బ్లాక్ ఫంగస్ ను తగ్గించే మందులు ఎంత మేర స్టాక్ అవసరమున్నదో అంచనా వేసి ఆ మేరకు తక్షణమే ఆర్డర్ ఇవ్వాలని సిఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు చికిత్స చేస్తున్నందున ఆ స్థాయిలో మందులు సమకూర్చాలని, కొరత రాకూడదన్నారు. రాష్ట్రంలో అటు కరోనా ఇటు బ్లాక్ ఫంగస్ తో మొత్తం వ్యవస్థ దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో ఉన్నదని సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.