FbTelugu

పోలీసుల అతి ప్రవర్తన అదుపు చేయండి- డీజీపీకి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు

హైదరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టులపై అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. ఆంధ్రజ్యోతి పొలిటికల్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ పై సోమవారం రాత్రి పోలీసులు దాడికి పాల్పడడం, అసభ్యకర పదజాలంతో దూషించిన సంఘటనపై విరాహత్ అలీ ఇవ్వాళ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సంఘటనతో పాటు నగరంలో మరో ఐదు చోట్ల జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగినట్లు ఆయన డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

రామంతాపూర్ వద్ద మెండు సీనియర్ పాత్రికేయులు మెండు శ్రీనివాస్ పై అతిగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఆయా పత్రికలు, ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టుల వద్ద మాత్రమే అక్రెడిటేషన్ కార్డు లుంటాయని, ఇతరత్రా విభాగాల్లో పనిచేసే జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఉండవని, ఇందుకుగానూ వారికి పోలీసుల నుండే గుర్తింపు కార్డులు జారీ చేయాలని విరాహత్ కోరారు.

ఇలాంటి చర్యలను సహించేది లేదు: డీజీపీ హామీ
విధినిర్వహణల్లో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా ఉండేందుకు పగడ్బందీ చర్యలు చేపడతాం… మెండు శ్రీనివాస్ పై పోలీసుల ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తున్నాను… ఈ సంఘటనపై తగు చర్యలు చేపడతామని డీజీపీ మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే మీడియా సంస్థల్లో అక్రెడిటేషన్ కార్డులు లేని సిబ్బందికి ఆయా పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీపీఆర్వో ల ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More