FbTelugu

ఉంచుతారా.. ఊడదీస్తారా..?

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో వేలాదిమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పనిచేస్తున్నా వారికి ఇచ్చే జీతం మాత్రం చాలా తక్కువ.

పైగా పనులన్నీ వారితోనే చేయిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అయినా, ఎప్పటికైనా తమ కొలువులు పర్మనెంట్‌ కాకపోతాయా అన్న ఆశతో ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కూడా ఎన్నికల సభల్లో రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది అంటూ ఎవరూ ఉండరు. అందరినీ పర్మనెంట్‌ చేస్తాం అని హామీ ఇచ్చారు. ఆ హామీ ఎప్పటికైనా నెరవేరకపోతుందా అన్న ఆశతో ఉన్నారు వారు.

కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వారి కొలువులు పర్మనెంట్‌ కావడం కాదు. అసలు వాటికే ఎసరొస్తుందా అన్న అనుమానాల్లో ఉన్నారు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న  ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. 15 సంవత్సరాలుగా చాలాచోట్ల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అవసరం లేకున్నా కొనసాగిస్తున్నారని ప్రభుత్వానికి అందిన నివేదికలో పలు శాఖల అధికారులు పేర్కొన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు తీసుకొని ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని నియమించారని, ప్రస్తుతం వీరి నిర్వహణ ప్రభుత్వానికి అదనపు భారం కావడంతో వారి పనితీరు ఆధారంగా వారిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వలన ఏజెన్సీలు మాత్రమే లాభపడుతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు 2,73,512 మంది ఉండగా అందులో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది 1.10 లక్షల మంది వరకు ఉంటారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పలుశాఖల్లో పలువురు ఉద్యోగులు రిటైర్మెంట్‌ అయిన నేపథ్యంలో వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో ప్రభుత్వం పనిచేయిస్తూ ఏజెన్సీల ద్వారా వీరికి వేతనాలను చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి రాబడులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం పొదుపు చర్యలను చేపట్టడానికి సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో నిధులు, వనరుల లభ్యత ఇంకా కుదుటపడని నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇదే క్రమంలో పలు శాఖల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమేర అవసరం, వారి వేతనాలు వంటి వాటిపై అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఈ ఏడాది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది రెన్యువల్‌పై ఆచితూచి అడుగువేయాలని ప్రభుత్వం నుంచి ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందించినట్టుగా సమాచారం. ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బంది అవసరం ఉంటేనే రెన్యువల్‌ చేయాలని లేని పక్షంలో ఖర్చులు, వేతనాలు తగ్గించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఎంతమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు, వారికి అనుమతించిన జీఓ, వారి హోదా, ఎప్పటివరకు గడువు ఉంది, వారి పనితీరు, ఏ ప్రాతిపదికన వారిని ఎప్పుడు నియమించారు, వంటి పూర్తి వివరాలతో అన్ని శాఖల అధిపతులు అందించిన వివరాల ఆధారంగా అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలిసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరినీ కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని చాలామందిని తొలగించి ఉన్నవారితోనే పనులుచేయించుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.

You might also like