FbTelugu

పొడిగింపా.. సడలింపా.. ఎత్తివేతా?

లాక్‌డౌన్‌ను సడలిస్తారా.. పొడిగిస్తారా.. లేక పూర్తిగా ఎత్తివేస్తారా..? దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఇప్పటికే కేంద్రం మూడుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించింది.

కేంద్రం నిర్ణయించిన ప్రకారం ఈ నెల 17తో లాక్‌డౌన్‌ కాలం ముగియనుంది. ఈ కాలంలో పలు రంగాలకు కొంత సడలింపు ఇచ్చారు. ఆ రంగాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. వాటిలో మద్యం దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. అవి జోరుగా నడుస్తున్నాయి. అయితే, కొన్ని రంగాలకు సడలింపు ఇచ్చిన సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ఏం చేయాలన్న విషయంపై ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విషయాలు చెబుతారు. దానిపై ప్రధాని తీసుకునే నిర్ణయం ఏమిటనే దానిపైనే అందరి దృష్టీ ఉంది. ఇప్పటికే అనేక రంగాలకు రిలాక్సేషన్‌ ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్న దానిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ను మరింత పొడిగిస్తారా.. లేక పూర్తిగా ఎత్తివేస్తారా.. కొంత రిలాక్సేషన్‌ ఇస్తారా అన్న విషయంలో ఇప్పటికీ ప్రధాని ఒక నిర్ణయానికి రాలేదని.. అన్ని రాష్ట్రాల సీఎంలు చెప్పే అభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఇటీవల కాలంలో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మృతులు కూడా అదేస్థాయిలో ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తే కరోనా తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దీనికితోడు సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ తెరవాలని, గ్రీన్, ఆరంజ్‌ జోన్లలో వందశాతం, రెడ్‌ జోన్లలో ఉన్న కార్యాలయాల్లో 33శాతం మంది వంతున కార్యాలయాలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెద్ద ఎత్తున జనం రోడ్లమీదకు వచ్చారు. వాహనాలు కూడా భారీగా రోడ్లెక్కాయి. దీంతో ఎక్కడా భౌతికదూరం పాటించడం లేదు. లాక్‌డౌన్‌ నిబంధనలు గాలిలో కలిశాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింత స్పీడుగా పెరిగే అవకాశాలున్నాయి.

దీనికి తోడు రైళ్ల రాకపోకలను కూడా పునరుద్దరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిద్వారా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిద్వారా కూడా పాజిటివ్‌ కేసులు పెరిగే ప్రమాదముందన్న అభిప్రాయంతో జనం ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ ఈ రోజు ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కావడం, కనీసం ఉద్యోగుల జీతాలు కూడా ప్రభుత్వాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో లాక్‌డౌన్‌ ఎత్తివేసే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రధాని నిర్ణయం ఏమిటో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగక తప్పదు. తెలంగాణలో మాత్రం లాక్‌డౌన్‌ను ఈ నెల 29వరకు సీఎం కేసీఆర్‌ ఇంతకుముందే పొడిగించారు. అయితే, ఈ నెల 15న మరోసారి అధికారులు, మంత్రులతో సమావేశమై లాక్‌డౌన్‌ పరిస్థితిపై సమీక్ష చేస్తామని చెప్పారు. దీంతో తెలంగాణలో కూడా ఏం జరుగుతుందోనన్న విషయంపై కూడా అందరూ టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు.

You might also like