FbTelugu

అదుపు తప్పిన కంటైనర్…12 మంది మృతి

Container-Accident--4-dead

చిత్తూరు: బంగారుపాళ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై మొగిలిఘాట్‌ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్‌ దాటి ఆటో, ఓమ్ని వ్యాన్‌, ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. మృతిచెందిన 12 మందిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కంటైనర్‌ ఒక్కసారిగా దూసుకెళ్లడంతో గుర్తుపట్టడానికి వీలులేని విధంగా మృతదేహాలన్నీ ఛిద్రమయ్యాయి. చీకటి పడటంతో పోలీసులకు మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది.

పరామర్శకు వెళ్లి మృత్యువాత…

మృతుల్లో 8 మందిని గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి శేఖర్‌ కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. రెడ్డి శేఖర్‌ కుటుంబసభ్యులు తెట్టుగుండ్ల పల్లి సమీపంలోని తమ బంధువుల కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఓమ్నీ వాహనంలో పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘటనాస్థలంలో మృతిచెందారు. వీరితో పాటు కంటైనర్‌ డ్రైవర్‌ కూడా అక్కడికక్కడే చనిపోగా‌ క్లీనర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్లీనర్ ను వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.

మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్నవారు

1. రామచంద్ర 50

2. రాము 38

3. సావిత్రమ్మ 40

4. ప్రమీల 37

5. గురమ్మ 52

6. సుబ్రమణ్యం 49

7. శేఖర్ 45

8. పాపమ్మ 49

9. నరేంద్ర ( ద్విచక్ర వాహన దారుడు) పలమనేరు మండలం బలిజపల్లి

10. కంటైనర్ డ్రైవర్

11. పేరు తెలియాల్సి ఉంది

12. పేరు తెలియాల్సి ఉంది.

You might also like