ప్రధాన ఆలయం నిర్మాణపనులు దాదాపు పూర్తి
యాదగిరిగుట్ట: ప్రధాన ఆలయం నిర్మాణపనులు దాదాపు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం తొందరలో ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
పుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షాపరుల సముదాయం, ప్రెసిడెన్షియల్ సూట్, విఐపి కాటేజీలు ఫినిషింగ్ పనులు 15 రోజుల్లో పూర్తికానున్నాయని అన్నారు. యాదాద్రి పనుల పురోగతిని బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుష్కరిణి, కళ్యాణ కట్ట పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పుష్కరిణికి ఇరువైపులా పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉండేలా చూడాలన్నారు. కళ్యాణకట్ట వద్ద బాత్రూంలను పరిశీలించారు. ఫినిషింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన ఆలయం మరెక్కడా లేదని, చరిత్రలో నిలిచే గొప్ప ఆలయం యాదాద్రి అని స్థపతులు మంత్రి తో చెప్పారు. ముఖ్యమంత్రి ఆధ్యాత్మికతకు, అకుంఠిత దీక్షకు నిదర్శనం ఈ అలయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి వారితో అన్నారు.