FbTelugu

ఈ పరిస్థితుల్లో అది అవసరమా?

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్తదానిని నిర్మించేందుకు పనులు మొదలు పెట్టింది. మంగళవారం నుంచే పాత భవనాల కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే, ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర ప్రజలతో పాటు విపక్ష నేతలు కూడా విమర్శలకు దిగుతున్నారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం దానిని గాలికొదిలేసి కొత్త సచివాలయం నిర్మాణానికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రశ్నిస్తున్నారు. కనీసం దానిని కూల్చకుండా ప్రస్తుతం కరోనా రోగులకు హోంక్వారంటైన్‌కైనా ఉపయోగిస్తే బాగుండేది కదా అన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి.

అయినా, సర్కారు మాత్రం దానిని కూల్చే పనిలో పూర్తిగా నిమగ్నమైంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న 704 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త సచివాలయాన్ని నిర్మిచడం అవసరమా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై విపక్షాలు కూడా విమర్శలకు దిగాయి. ఇటీవల ఓ ప్రైవేట్‌సంస్థ నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది నూతన సెక్రటేరియట్‌ అవసరం లేదన్న వెలిబుచ్చడం గమనార్హం. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి నూతన సెక్రటేరియట్‌ నిర్మాణంపై పడింది.

నిర్మాణానికి డబ్బులెక్కడివి?

కొత్త సచివాలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను సర్కారు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుందనే అంశంపై హైకోర్టు తీర్పు అనంతరం తాజాగా చర్చోపచర్చలు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయం స్థానంలో నూతన సెక్రటేరియట్‌ను నిర్మించేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం కూడా చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ ఏ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్‌)న్ని దాఖలు చేసిన సంగతి విదితమే. ప్రస్తుత సచివాలయంలో పది భవనాలున్నాయనీ, వాటి కూల్చివేయడం ద్వారా వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వారు తమ పిల్‌లో పేర్కొన్నారు. దీనిపై అటు ప్రభుత్వం తరఫున, ఇటు పిటిషనర్ల తరఫున నెలల తరబడి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రస్తుత సచివాలయంలో సరైన సదుపాయాల్లేవనీ, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయంటూ ఆ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసిన హైకోర్టు సచివాలయంలోని భవనాల కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నలిచ్చింది.

రూ.500 కోట్లు ఖర్చు

ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు కుదుటపడ్డ వెంటనే నూతన సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. అందుకోసం రూ.500 కోట్లు ఖర్చవుతాయని ఇటు ఆర్థికశాఖ అధికారులు, అటు భవన నిర్మాణ ఇంజినీరింగ్‌ నిపుణులు అంచనా వేశారు. ఈ డబ్బును సమకూర్చుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌.. ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే మన అప్పులు రూ.మూడు లక్షల కోట్లకు చేరడం, కరోనాతో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా పడిపోవడంతో మరోసారి రుణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. తాజాగా సాధారణ ఖర్చుల కోసం బాండ్లను కుదువపెట్టడం ద్వారా సర్కార్‌ ఆర్‌బీఐ వద్ద రూ.రెండు వేల కోట్లను తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నూతన సచివాలయ నిర్మాణానికి కొత్తగా అప్పులు తేవడం మినహా మరే ఇతర మార్గం కనిపించడం లేదని స్పష్టమవుతోంది. అవసరం లేకున్నా మరిన్ని అప్పులు తెచ్చి సచివాలయం కట్టడం ఇప్పుడు అవసరమా అని అనేక విమర్శలొస్తున్నా సర్కారు మాత్రం వెనక్కి తగ్గడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.