FbTelugu

వారం గడవకముందే..!

కొండపోచమ్మ సాగర్‌ కాల్వల నిర్మాణంలో డొల్లతనం మరోసారి బయటపడింది. ఇటీవల గజ్వేల్‌ మండలం కొడకండ్ల హెడ్‌ రెగ్యులేటరీ వద్ద, మర్కుక్‌ పంప్‌హౌస్‌ వద్ద సిమెంట్‌ లైనింగ్‌ దెబ్బతినడం, కొండపాక మండలం ఎర్రవల్లి వద్ద కాల్వలు దెబ్బతిన్న ఘటనలు మరువకముందే తాజాగా మంగళవారం మర్కుక్‌ మండలం శివారు వెంకటాపూర్‌లో కాల్వకు భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ పంట పొలాలు, ఇళ్లలోకి చేరాయి. ఈ హఠాత్పరిణామం వల్ల గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

అలాగే.. 30 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. వానాకాలం సమీపించే వరకు కాల్వల ద్వారా నీరు వదలాలనే ఉద్దేశంతో వేగంగా పనులు చేయడం.. పనుల్లో నాణ్యత లోపించడం.. సిమెంట్‌ లైనింగ్‌ సక్రమంగా చేయకపోవడం.. కాల్వల కోసం పోసిన కట్టలను గట్టిపడే వరకు తొక్కించకపోవడం, సరిగా చదును చేయకపోవడంతో కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం మూడు చోట్ల గండ్లు పడ్డాయి.  కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి జగదేవ్‌పూర్‌ కాల్వకు రిజర్వాయర్‌ నుంచి 3.5 కిలోమీటర్ల కాల్వ మేడ్చల్‌ జిల్లా తుర్కపల్లి వద్ద కలుస్తుంది. ఇక్కడ జగదేవ్‌పూర్, తుర్కపల్లి కాల్వలు పాయలుగా విడిపోతాయి. జగదేవ్‌పూర్‌ కాల్వ శివారు వెంకటాపూర్‌ నుంచి తీగుల్‌ వైపు వెళ్తుంది. ఈ కాల్వలను జూన్‌ 24న ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఉదయం 6.30 గంటలకు శివారు వెంకటాపూర్‌ వద్ద మొల్లోనికుంట సమీపంలోని కాల్వ ప్రదేశంలో భారీ గండి పడింది. దీంతో కాల్వ కింది భాగంలో ఉన్న కల్వర్టు ద్వారా మొల్లోని కుంటలోకి భారీ ప్రవాహం, మరో ప్రవాహం గ్రామంలోకి వెళ్లింది. దీని వల్ల 30 ఎకరాల్లో మిర్చి, టమాట, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు గ్రామంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. టీవీలు, వంట సామగ్రి, బియ్యం, బట్టలు, ఇతర విలువైన వస్తువులు తడిసిపోయాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.

You might also like