FbTelugu

తిరుపతి ఎన్నికల్లో వందల కోట్లు కుమ్మరింత: చింతా మోహన్

తిరుపతి: తిరుపతిని మరో పులివెందులుగా మార్చాలని సీఎం వైఎస్.జగన్ అనుకుంటున్నాడని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు.
ఇవాళ చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరం పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలకు చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యబద్దంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న పొరపాటు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ సహించదన్నారు. అధికారులు, పోలీసు యంత్రాంగం తమ పరిధిదాటి, అధికార పార్టీ మెప్పు కోసం పని చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తప్పులు చేసే అధికారులను గుర్తు పెట్టుకుని, జైలుకు పంపుతామని చింతా మోహన్ హెచ్చరించారు.
ఏడుగురు మంత్రులు, రూ.700 కోట్లు డబ్బు సంచులు, మద్యం తెచ్చి, ఓట్లు కొనుగోలు చేసి, తిరుపతిలో 4 లక్షల మెజారిటీతో గెలవాలని వైసిపి అనుకుంటోందన్నారు. ఒక్క రూపాయి డబ్బు పంచినా, మందు బాటిళ్ల తో ఓటర్లను ప్రభావితం చెయ్యలనుకుంటే, సహించబోమన్నారు. ఒకప్పుడు వైఎస్.రాజశేఖర రెడ్డి పులివెందులలో 2500 ఓట్లు మెజారిటీతో గెలిచాడు. నేడు పులివెందులలో లక్షల మెజారిటీ ఎలా సాధ్యం? అని నిలదీశారు. లైట్లు ఆర్పి, చీకట్లో దొంగ ఓట్లు వేసుకునేందుకే రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సమయం పెంచారన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలన్నారు. రైల్వే శాఖలలో 3 లక్షల మంది ఉద్యోగులలను ఇంటికి పంపేందుకు బిజెపి ప్రభుత్వం రంగం సిద్దం చేసిందన్నారు. 58 సంవత్సరాలు దాటిన, 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న రైల్వే ఉద్యోగస్తులను ఉద్వాసన పలికేందుకు బిజెపి ప్రభుత్వం రెడీగా ఉందని చింతా మోహన్ ఆరోపించారు.

ఎన్నికల అనంతరం, అతి త్వరలో ప్రైవేటీకరణ చర్చలలో భాగంగా దేశంలోని రైళ్లను అమ్మేస్తారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. అవినీతిపరులు, నిజాయితీకి మధ్య జరుగుతున్న యుధ్ధం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అన్నారు. నిరుపేదలు, కోటీశ్వరులకు మధ్య జరుగుతున్న యుధ్ధం ఈ ఎన్నిక అని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని చింతా మోహన్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.