FbTelugu

కర్ణాటకలో బిజేపి కి చావుదెబ్బ..

– స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

– 120 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

– సీఎం సొంత జిల్లాలోనూ బిజెపి కి ఎదురుగాలి

బెంగళూరు: కర్ణాటకలో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో ఘోర పరాభవం ఎదురుకావడంతో కమలనాథులు కలవరపడుతున్నారు. సిఎం యడియూరప్ప సొంత జిల్లాలో బిజెపికి ఎదురుగాలి వీయడం గమనార్హం.

గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బిజెపికి ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. గమనించాల్సిన విషయం ఏమంటే బిజెపి కంటే జెడిఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టడం చర్చనీయాంశం అయ్యింది. బిజెపి 57 స్థానాలకే పరిమితం కాగా, జెడిఎస్ 66 స్థానాల్లో గెలుపొందడం కమలనాధులకు కంటినిండా కునుకు కరువైంది. బళ్లారి మున్సిపల్  కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 39 వార్డుల్లో 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, బిజెపి 14 చోట్ల, ఇతరులు ఐదు చోట్ల గెలుపొందారు.

బీదర్‌లో హంగ్ ఏర్పడగా  15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 8, జెడిఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో గెలుపొందింది. రామనగరలో పువ్వు గుర్తుకు ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. ఇక్కడ 31 స్థానాలకు గాను కాంగ్రెస్ 19, జెడిఎస్ 11, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. రామనగర జిల్లా చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో 31 వార్డులకు గాను జెడిఎస్ 16 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడు, బిజెపి ఏడు స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు.

హసన్ జిల్లాలోని బేలూరు పురసభలోనూ కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ 17, జెడిఎస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కమలానికి ఒక్క స్థానం దక్కింది. ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లాలోనూ బిజెపి కి ఎదురుగాలి వీచింది. ఇక్కడ మొత్తం 35 స్థానాలుండగా కాంగ్రెస్ 18, జెడిఎస్ 11, బిజెపి  4 స్థానాల్లో గెలుపొందాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బిజెపి 6 స్థానాల్లో విజయం సాధించగా, చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కమలం ఖాతా తెరవలేదు. 11 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, జెడిఎస్ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు.

బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలోనూ పువ్వు గుర్తు పార్టీ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ 23 వార్డులకు గాను జెడిఎస్ 14, కాంగ్రెస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా, బిజెపి ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. మడికెరె నగరసభను మాత్రం కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కమలానికి 16, ఎస్‌డిపిఐ 5, కాంగ్రెస్, జెడిఎస్‌లు ఒక్కో స్థానంలో గెలుపొందాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.