FbTelugu

కాంగ్రెస్ కు అధికారం కల్ల: గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ: పార్టీ పలు రాష్ట్రాలలో ఓటమి పాలు కావడం, అధికారం దక్కే సూచనలు కనుచూపు మేరలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నిరసన గళమెత్తుతున్నారు.

నిన్న మొన్నటి వరకు అధిష్టానమే కరెక్టు అని వంతపాడిన నేతలు ఇప్పుడు మాటమార్చుతుండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ దూకుడుతో ఇప్పటికే తలలు పట్టుకున్న సోనియా గాంధీకి, సీనియర్ల విమర్శల ధాటి మరింత కుంగిపోయేలా చేస్తున్నది. అధిష్టానం ఒంటెద్దు పోకడలపై ఇప్పటికే సీనియర్ నాయకులు కపిల్ సిబాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి చల్లారక ముందే మరో సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ గళమెత్తారు. కాంగ్రెస్ లో ఫైవ్ స్టార్ సంప్రదాయం బాగా పెరిగిపోయిందని, ప్రజల మధ్య తిరగాల్సిన నేతలు ఏసీ రూముల్లో గుడుపుతున్నారని ఆయన మండిపడ్డారు.
పార్టీలో ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, నాయకుల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలపై ఏమాత్రం పోరాటాలు చేయకుండా ప్రెస్ నోట్లు రిలీజు చేసి నాయకులుగా చెలామణి అవుతున్నారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు జాతీయ స్థాయి నాయకత్వం ఆదర్శంగా ఉండడం లేదని గులాం నబీ ఆరోపించారు. 2004, 2009 లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునర్ వైభవం రావాలంటే ప్రజలతో మమేకం కావాలని, కిందిస్థాయి నుంచి నిర్మాణం జరగాలన్నారు. అధ్యక్షుడు ఎవరు అని నేను ప్రశ్నిస్తే, తిరుగుబాటుదారుడు అని నాపై ముద్ర వేశారని గులాం నబీ ఆరోపించారు. లోకసభలో కాంగ్రెస్ పార్టీకి విపక్ష నేత హోదా కూడా దక్కలేదంటే సిగ్గుతో తలదించుకోవాలని ఆయన అధిష్టానాన్ని తూర్పారబట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.