FbTelugu

పోతిరెడ్డిపాడుపై బీజేపీ, కాంగ్రెస్ నేతల దీక్షలు

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వేర్వేరుగా నిరసనకు దిగాయి. రెండు పార్టీల నేతలు  సీఎం కేసీఆర్ వైఖరిని తూర్పారబట్టారు.

గాంధీభవన్ లో పోతిరెడ్డిపాడు పై పోరు నిరసన దీక్షలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూర్చున్నారు. మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సిహెచ్.వంశీచంద్ రెడ్డి నల్ల రిబ్బన్లు కట్టుకొని దీక్ష ప్రారంభించారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ, అందరూ కరోనా టెన్షన్ లో ఉంటే ఏపీ సీఎం జగన్ రెడ్డి నీళ్లు దోచుకునే పనిలో పడ్డారని విమర్శించారు. దీనిపై అందరి కన్నా ముందు స్పందించాల్సిన సీఎం కేసీఆర్, ఆలస్యంగా మేల్కొన్నారన్నారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్, జగన్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని, అందుకే ఉత్తి ఉత్తిగా కేసీఆర్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ను సీఎం చేశానని చెప్పుకుంటన్న కేసీఆర్, పోతిరెడ్డిపాడు విషయం ఎందుకు పిలిచి చెప్పడంలేదన్నారు. ఈ దీక్షలో డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ జీఓ పై సుప్రీంకోర్టుకు వెళ్లాలి…

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును ఆపలేని అసమర్థ కెసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్ష ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 203పై వెంటనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డు, సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది.

You might also like