FbTelugu

పోటీ ఖాయమైంది.. అభ్యర్థులే తేలాలి!

తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు నెలల్లోగా అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ రామలింగారెడ్డి సతీమణికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తే ఏకగ్రీవానికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పడంతో చాలామంది దుబ్బాక ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావించారు. కానీ, తమ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని బీజేపీ ప్రకటించింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేయాలన్నది తమ పార్టీ జాతీయ విధానమని, పైగా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్న తమ పార్టీ ఈ ఎన్నికలో తప్పకుండా పోటీ చేస్తుందని తేల్చి చెప్పింది.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ పోటీలో తమ పార్టీ పోటీలో ఉండడం ఖాయమని తేల్చారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక ఏకగ్రీవం కాదన్న విషయం తేలింది. అయితే, పోటీ అనివార్యమని తేలినా.. అభ్యర్థులెవరో మాత్రం ఇంకా తేలలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ రామలింగారెడ్డి కుటుంబంలోనే ఒకరికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ మాత్రం రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్‌ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే, ఇదే టికెట్‌ కోసం రామలింగారెడ్డి కుమారుడు సతీష్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ సాగుతోంది. చివరకు రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కూడా సతీష్‌రెడ్డివైపే మొగ్గు చూపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.

సతీష్‌రెడ్డి ఇప్పటికే తన తండ్రితో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ, ప్రభుత్వ పదవి ఏమీ లేనప్పటికీ తన తండ్రి రామలింగారెడ్డికి రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉండడంతో ఆయనకు కొంత రాజకీయ అనుభవాలు.. పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గంలోని ప్రజలతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి రామలింగారెడ్డి భార్య సుజాత కంటే కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో కేసీఆర్‌ కూడా సతీష్‌రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన మద్దుల సోమేశ్వర్‌రెడ్డికే తిరిగి టికెట్‌ ఇస్తారా.. లేక మరో వ్యక్తిని రంగం మీదకు తీసుకువస్తారా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అయితే, ఇక్కడ పోటీ నామమాత్రమే కావడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఉత్సాహంగా లేరని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.

కాకపోతే, ఎన్నికలో పోటీ చేయాలి కాబట్టి ఎవరినో ఒకరిని పార్టీ నిలబెట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన రఘునందన్‌రావునే మళ్లీ ఆ పార్టీ బరిలోకి దించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఉంటే తప్ప అక్కడ అభ్యర్థి మార్పు ఉండదని స్థానికులు, బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన దుబ్బాక నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లను సాధించారు. అక్కడ బీజేపీ ఓట్లు ప్రతి ఎన్నికల్లో పెరుగుతూ వస్తున్నాయి. దీంతో తమ ఓటు బ్యాంకును పెంచుకోవడంతో పాటు అక్కడ బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే పోటీ తప్పనిసరిగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పోటీలు ఉంటామని తేల్చినా.. టీడీపీ, వామపక్షాలు మాత్రం దీనిపై ఇంతవరకు నోరు మెదపలేదు. ప్రస్తుతం ఈ పార్టీలకు ఇతర పార్టీలతో పొత్తులేవీ లేకపోవడంతో ఈ ఎన్నికల్లో వారు పోటీ చేస్తారా.. చేయకపోతే ఎవరికి మద్దతు ఇస్తారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్థి ఎవరనేది తేలాలంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేదాకా ఆగాల్సి ఉంటుందేమో.!

You might also like