FbTelugu

10 రోజుల్లోపే పరిహారం అందించాం: జగన్

గ్యాస్ లీకేజీ బాధితులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులతో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ఘటన చాలా బాధాకరమన్నారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు చెప్పానని గుర్తు చేశారు. నాడు ఓఎన్జీసీ లో గ్యాస్ లీకై 22 మంది చనిపోతే.. ఓఎన్జీసీ సంస్థ మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.2 లక్షలు మాత్రమే అందించాయని తెలిపారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనేలా ప్రభుత్వం స్పందించాలన్నారు. ఓఎన్జీసీ ఘటనలో బాధితులకు రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలని అనాడే డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనూ తనకు అదే గుర్తొచ్చిందన్నారు. అందుకే ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వం వేగంగా స్పందించిందని తెలిపారు.

రెండు గంటల్లోనే గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించినట్టు తెలిపారు. ఈ ఘటనపై మంత్రులతో, అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 13 వేల టన్నుల స్టైరిన్‍ను రెండు షిప్‍ల ద్వారా వెనక్కి పంపించినట్టు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కు ఒక్క అనుమతి కూడా తాము అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదన్నారు. అయినా తాను ఎక్కడా రాజకీయ ఆరోపణలు చేయలేదని తెలిపారు.

10 రోజుల్లోపే పరిహారంతో పాటు వైద్య సేవలను పూర్తిగ అందించినట్టు తెలిపారు. గ్యా స్ లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభావిత గ్రామాల్లోని ప్రతివ్యక్తికి రూ.10 వేలు ఆర్థికసాయం అందించినట్టు తెలిపారు.

వెంటిలేటర్‍పై ఉన్నవారికి రూ.10 లక్షలు రెండ్రోజులకు పైగా ఆస్పత్రుల్లో ఉన్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించినట్టు తెలిపారు. కమిటీలు ఇచ్చే నివేదికల ద్వారా తప్పు ఎవరివల్ల జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. మీ ఇంట్లో బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడని అన్నారు. ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగనివ్వనని తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసి, ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు.

You might also like