FbTelugu

వామపక్షం.. ఎవరి పక్షం!

తెలంగాణలో వామపక్షాల పరిస్థితి ఏమిటో అంతుచిక్కకుండా మారింది. ఈ కన్‌ఫ్యూజన్‌ ప్రజలకే కాదు.. ఆ పార్టీ క్యాడర్‌కు కూడా అర్ధం కావడం లేదు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరితో ఎందుకు కలుస్తున్నారో.. మరోచోట వారికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు.

టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలని స్పీచులిచ్చిన నేతలు సాగర్‌ ఎన్నికల్లో అదే పార్టీకి ఓటేసి గెలిపించాలని తీర్మానించారు. అక్కడ బీజేపీని అడ్డుకోవడం కోసమని చెప్పారు. కానీ, వాస్తవ పరిస్థితి ఏంటంటే సాగర్‌లో బీజేపీది నామమాత్రపు పోటీ మాత్రమే. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే. బీజేపీకి మూడోస్థానమే. అలాంటప్పుడు బీజేపీని అడ్డుకోవడం కోసం అని ఎందుకు చెప్పారో ఆ పార్టీ నాయకులకే తెలియాలి. పైగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి బాగా లేదని, టీఆర్‌ఎస్‌పై పోరాడే శక్తి దానికి లేదని, ప్రతిపక్షంగా వ్యవహరించలేని స్థితిలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని సాగర్‌ ఎన్నికల్లో చెప్పారు. కానీ, ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో మాత్రం సాగర్‌ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పంచన చేరారు. మరి ఇక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగైందని భావించారా.. లేక ఇప్పుడు ఆ పార్టీకి టీఆర్‌ఎస్‌పై పోరాడేందుకు చిత్తశుద్ది, బలం వచ్చిందా అన్న విషయం తెలియదు. పైగా పై స్థాయి నాయకులు చెప్పేదేంటంటే స్థానిక నాయకుల అభిప్రాయాల ప్రకారం పొత్తుల విషయంలో వారే నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీ నిబంధనావళికి ఇది విరుద్ధం. ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థిని నిర్ణయించాలంటే స్థానిక నాయకులతో చర్చించి చేసిన నిర్ణయాన్ని పై కమిటీలు ప్రకటిస్తాయి. ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించాలన్నా.. ఆ ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలన్నా కిందిస్థాయి కమిటీల నుంచి పై స్థాయి కమిటీల వరకు చర్చిస్తారు. ఆ నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి పంపుతారు. ఆ కమిటీ అనుమతితో రాష్ట్ర కమిటీలు ప్రకటిస్తాయి. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎక్కడి కమిటీలు అక్కడే నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. దీంతో తమ అభిప్రాయాలను తీసుకోకుండా నాయకులు నిర్ణయాలు చేస్తున్నారన్న ఆగ్రహం పార్టీ క్యాడర్‌లోనూ ఉంది. అది ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా బయట పడుతోంది. ఎన్నికలు జరిగిన ఒక్కోచోట ఒక్కోరకమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో సీపీఎం కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. అసలు తమ పార్టీ ఎవరి పక్షం.. అధికార పక్షమా.. ప్రతిపక్షం వైపా.. లేక ప్రజాపక్షమా అనే విషయంలో తమకే క్లారిటీ లేకుండా పోయిందని ఆందోళనకు గురవుతున్నారు.
ఖమ్మంలో చెరోపక్షం!
ఇటీవల జరిగిన నల్లగొండ–ఖమ్మం– వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాలు ఉమ్మడి అభ్యర్థికి సీపీఐకి చెందిన జయసారథిరెడ్డిని రంగంలోకి దించాయి. ఈ రెండు పార్టీలు విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేశాయి. కానీ, ఆ అభ్యర్థి ఓడిపోయారనుకోండి అది వేరే విషయం. ఆ తర్వాత సాగర్‌ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు ఒకేమాట మీద నిలబడి అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాయి. ఈ పరిణామాలను చూసిన పాతతరం కమ్యూనిస్టులు ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాగర్‌లో ఆ పార్టీల నిర్ణయం తప్పు అయినా, రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవడాన్ని వారు హర్షిస్తున్నారు. వాస్తవానికి కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసిపోవాలన్న చర్చ జోరుగా సాగింది. కానీ, ఇంతవరకు ముందుకు సాగలేదు. ఈ తరుణంలో పార్టీలు కలిసిపోకపోయినా.. కలిసి ఒక నిర్ణయాన్ని చేసి అమలు చేస్తున్నాయని భావించారు. కానీ, ఇది మూణ్నాళ్ల ముచ్చటే అన్నట్టుగా రెండు పార్టీల నిర్ణయాలు తేల్చివేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, సాగర్‌ ఉప ఎన్నికల్లో ఒకే నిర్ణయంతో కలిసి పనిచేసిన సీపీఎం, సీపీఐలు ఖమ్మం పురపాలక సంఘం ఎన్నికల్లో మాత్రం వేటి దారి అవి చూసుకున్నాయి. సీపీఐ అధికార టీఆర్‌ఎస్‌ పంచన చేరితే.. సీపీఎం విపక్ష కాంగ్రెస్‌తో జత కట్టింది. ఇలా వామపక్షాలు ఎప్పుడు ఎవరికి మద్దతు తెలుపుతాయో.. ఎవరిని వ్యతిరేకిస్తాయో తెలియక తెలంగాణ వాసులు జుట్టు పీక్కుంటున్నారు. మరి ఈ నిర్ణయాలు తీసుకుంటున్న నాయకులకైనా వీటిపైన క్లారిటీ ఉందో లేదో మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.