న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రైతు సంఘాల నాయకులను ఇవాళ రాత్రి 7 గంటలకు చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల చర్చల్లో చట్ట సవరణలకు ససేమిరా అనడంతో కొత్త ప్రతిపాదనలతో ముందుకు వస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు.
ఇవాళ జరిగిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ ముగిసినప్పటికీ తమ ఆందోళనలను కొనసాగిస్తునే ఉంటామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందేనని, కొత్తగా ప్రవేశపెట్టిన మూడు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా నాలుగు గంటల పాటు బంద్ పాటించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒక రోజు నిరాహారదీక్షకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రోకోలు, ప్రదర్శనకారులు కదం తొక్కారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కన్పించలేదు.
బంద్ ను జయప్రదం చేసిన అందరికీ రైతు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. బంద్ పూర్తి కావడంతో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలు అనుమతిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో బంద్ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, దుకాణాలు, విద్యా సంస్థలు, టోల్ ఫ్లాజాలు మూతపడ్డాయి.