FbTelugu

ఫ్యాన్ కింద‌కు వ‌స్తారా.. జైలు పాల‌వుతారా!

Come-on-under-the-fan

ఇదేం అల్టిమేటం.. నిజంగా వైసీపీ ఇలా చేస్తుందా! అనే సందేహాలు వ‌ద్దేవ‌ద్దు. ఇది ఏదో ఊసుపోక చెప్పే విష‌యం కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న వాస్త‌వ‌రూపానికి నిలువెత్తు సాక్ష్యం. శ్రీకాకుళంలో బీజేపీ జెండా దిమ్మె క‌డుతున్నార‌ని పోలీసుల సాయంతో కుమ్మేశారు. ఇక గుంటూరు జిల్లా ప‌ల్నాడులో బీజేపీ స‌భ్య‌త్వం సేక‌రిస్తుంటే కుళ్ల‌బొడిచారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ శ్రేణులు టీడీపీను మాత్రమే ప్ర‌త్య‌ర్థిగా భావించాయి. ఇప్పుడు బీజేపీ కూడా వైరివ‌ర్గంలోకి చేర్చారు. మొన్న సీబీఐ కోర్టు కూడా తూచ్ శుక్ర‌వారం రావాల్సిందేనంటూ హుకుం జారీచేయ‌టంతో బీజేపీ కూడా ఫ్యాన్ పార్టీకు శ‌త్రువుగానే మారింద‌ట‌.

అంతే.. ఇంకెందుకు ఆల‌స్యం.. జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ మూడు మ‌న‌కు ప్ర‌త్య‌ర్థులేనంటూ పార్టీ నుంచి సందేశం అందిందా! అనేంత‌గా వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ప‌ల్లె, ప‌ట్ట‌ణం అని తేడాలేకుండా విప‌క్ష కార్య‌క‌లాపాల‌ను అడ్డుకుంటున్నాయి. ఎలాగూ పోలీసులు కూడా అధికార పార్టీకే మొగ్గుచూపుతారు కాబ‌ట్టి ఇక అడ్డేముంటుంది. అయితే.. ఇక్కడ చిన్న కొస‌మెరుపు ఉందండోయ్‌. రండి బాబూ రండీ.. వైసీపీలో కి వ‌స్తారా.. అక్క‌డే ఉండి జైలుకుపోతారా అనేంత‌గా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు పెత్త‌నం చెలాయిస్తున్నార‌ట‌. అదెంత‌గా మారిందంటే.. నిన్న‌టి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు ఏదో ఒక‌సారి పోలీస్ స్టేష‌న్‌కు పోయేవాళ్లం.. ఇప్పుడు రోజు రెండుసార్లు పోలీసుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోందంటూ చోటా నాయ‌కులు చీద‌రించుకునేంత వ‌ర‌కూ ప‌రిస్థితి చేరింది. అన‌వ‌స‌రంగా అధికారంలోకి వ‌చ్చామంటూ అక్క‌డ‌క్క‌డా మ‌నోవేద‌న వ్యక్తంచేస్తున్న జ‌గ‌న్ వీరాభిమానులూ క‌నిపిస్తున్నారు. ఐదు నెల‌ల‌కే ఇంత‌టి న‌ర‌కం చూపుతున్న అధికారపార్టీ ఐదేళ్ల‌లో ఇంకెంత‌గా చెల‌రేగుతుందనే ఆందోళ‌న కూడా ఇత‌ర పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో మొద‌లైంది.

వ‌ల్ల‌భ‌నేని వంశీ అంత‌టి వాడే.. నాకీ రాజ‌కీయాలు వ‌ద్దు మొర్రో అంటూ రాజీనామా చేశాడు. అయినా వైసీపీ వ‌ద‌ల్లేదు. నీ రాజ‌కీయాలు మాకు కావాలంటూ.. వైసీపీ కండువా కప్పించుకునేందుకు ఒప్పుకునేంత‌గా చేశార‌ట‌. క‌డ‌ప‌లో జ‌గ‌న్‌పై తొడ‌కొట్టిన ఆదినారాయ‌ణ‌రెడ్డి కూడా కాషాయ‌పంచ‌న చేరాడు. జ‌గ‌న్ సీఎం కాగానే సుజ‌న వంటి భ‌జ‌న బ్యాచ్ కూడా మోదీ నామ‌స్మ‌ర‌ణ‌తో త‌మ‌ను తాము ర‌క్షించుకుంటున్నాయి. అంత‌టి పెద్ద‌లే సాష్టాంగ ప‌డిన‌పుడు సామాన్య కార్య‌క‌ర్త‌లం మ‌న‌కెందుకీ తంటా అనుకుంటూ.. వైసీపీలోకి చేరి కండువా క‌ప్పుకుని జ‌గ‌న్‌కు జై కొడ‌తామంటూ.. వైసీపీ ఎమ్మెల్యేల వ‌ద్ద‌కు టీడీపీ కార్య‌క‌ర్త‌లు చేరుతున్నార‌ట‌. ఇప్ప‌టికి బాగానే ఉన్నా.. 2024 నాటికి పార్టీ మారిన వారంతా ఫ్యాన్ రెక్క‌ల‌కే ఓటేస్తారా అనే అనుమానం కూడా లేక‌పోలేదు సుమా!!!

You might also like