FbTelugu

ఏపీలో అక్టోబరు 15 నుంచి కాలేజీలు

సెప్టెంబరులో కామన్ ఎంట్రన్స్ టెస్టులు

అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబరు నెలలో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించాలని, ఆపై అక్టోబరు 15 నుంచి కాలేజీలు ప్రారంభించాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇక నుంచి డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్ షిప్ అమలుపర్చాలని, ఏడాదిపాటు స్కిల్ డెవలప్ మెంట్ బోధన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉన్నత విద్యపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కళాశాలల రీ ఓపెనింగ్, కామన్ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మూడేళ్ల, నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్ విధానం తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, అనంతరం మరో ఏడాది పాటు స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి కల్పన కోర్సుల బోధన జరపాలని తెలిపారు. ఆ తర్వాతే అది డిగ్రీ ఆనర్స్ గా పరిగణించబడుతుందని సీఎం వెల్లడించారు. అయితే, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థి సాధారణ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? లేక ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? అనే దానిపై దరఖాస్తులో ఆప్షన్ ఉంటుందని సీఎం జగన్ వివరించారు.

ఏదైనా కాలేజీ అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించవద్దని, కఠినచర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున కచ్చితంగా గ్రాస్ ఎన్ రోల్ మెంట్ పెరగాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You might also like