FbTelugu

కిషన్ రెడ్డి, సంజయ్ మధ్య కోల్డ్ వార్

ఎంపి ఎ.రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కాంగ్రెస్ ఎంపి ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర బిజెపిలో రెండు గ్రూపులు ఉన్నాయని, ఒకటి కెసిఆర్ గ్రూపు కాగా మరోటి ఒరిజినల్ బిజెపి అన్నారు.
అందులో కెసిఆర్ గ్రూపునకు ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడూ తెరుచుకుంటాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ.. ప్రగతి భవన్ గేట్లు.. ప్రజాప్రతినిధులకు, పబ్లిక్ కు తెరుచుకోవని అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు ను బలిపశువును చేసే కుట్ర జరుగుతుందని జోస్యం చెప్పారు. బిజెపి, టీఆర్ఎస్ కుమ్మకై రంగారెడ్డి జిల్లాలో లింగోజిగూడలో టీఆర్ఎస్ పార్టీ బరిలో అభ్యర్థిని పెట్టలేదని ఆరోపణలు చేశారు. అదే విధంగా జల్ పల్లి లో ఏకగ్రీవం ఎలా అయిందని ప్రశ్నించారు. జల్ పల్లి లో.. ఎంఐఎం పార్టీకి అనుకూలంగా ఎలా ఏకగ్రీవం చేస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఎంఐఎం పార్టీకి అంతర్గతంగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు నెంబర్ 26 లో దుబ్బాక కాంతమ్మ చనిపోతే.. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు బరిలో దిగాయని విమర్శించారు. రెండు పార్టీలు పోటీకి దిగడంతో చివరికి ఎంఐఎం పార్టీ కూడా పోటీలో పెట్టిందన్నారు. తెలంగాణలో ఓ మంచి సంప్రదాయం తేవాలని టీఆర్ఎస్ అనుకోవడం లేదన్నారు. నల్గొండలో మా కాంగ్రెస్ అభ్యర్థి చనిపోతే ఎట్లా పోటీ లో పెడతారని ఆయన నిప్పులు చెరిగారు. అమ్మానాన్న మధ్యలో తమిళ అమ్మాయిలా.. టీఆర్ఎస్, బిజెపి మధ్య మజ్లిస్ పార్టీ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్, బిజెపి లోపాయకారి పొత్తులపై విచారణ కమిటీ వేసి.. రామచందర్ రావును ఆగం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. కిషన్ రెడ్డి పొమ్మంటేనే రామచందర్ రావు ప్రగతి భవన్ కు వెళ్ళాడని, కెటిఆర్ ను కలిశాడని అన్నారు. బిజెపిలో అంతర్గత పోరు తీవ్రంగా వుందని… బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కేంద్ర మంత్రి పదవి నుండి కిషన్ రెడ్డిని తొలగించాలని బండి సంజయ్ ఫిర్యాదులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.