FbTelugu

ఏపికి 25 లక్షల డోసులు పంపించండి: జగన్

అమరావతి: రాష్ట్రంలో ‘టీకా ఉత్సవం’ కోసం వెంటనే 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు పంపించాలని సిఎం వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవం’ నిర్వహిస్తున్నందున ముందే 25 లక్షల డోసులు పంపించాలని ఆ లేఖలో జగన్ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి జగన్‌ లేఖ రాశారు. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వాక్సినేషన్‌కు సంబంధించి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ నేపథ్యంలో కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు సంబంధించి టెస్ట్, ట్రాక్, ట్రేస్‌ నిర్దిష్ట పద్ధతిలో జరగాలన్న మీ సూచనలను రాష్ట్రంలో పక్కాగా అనుసరిస్తున్నాము. రాష్ట్రంలో కూడా కోవిడ్‌ నివారణ చర్యల్లో మీరు అందించిన సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కోవిడ్‌ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు, వాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అమలు చేస్తున్నాము. ఆ దిశలో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవం’ నిర్వహించాలన్న మీ నిర్దేశం ఈ ప్రక్రియలో ఎంతో ఉపయోగకరం కానుంది. సమాజంలోని అన్ని వర్గాల వారు వాక్సిన్‌ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడంలో టీకా ఉత్సవం స్ఫూర్తి దాయకం కానుంది.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి) పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో టీకా ఉత్సవం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని లేఖలో ప్రధానికి సిఎం జగన్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.