FbTelugu

ఉభ‌య‌గోదావ‌రి వరదలపై సీఎం సమీక్ష

తాడేప‌ల్లి: ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని సీఎం వైఎస్. జ‌గ‌న్‌ మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని ఆయన కోరారు.

ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సూచించారు. గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నేను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు.

అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని సీఎం తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాల‌ని అన్నారు. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాల‌ని, సమాచారం తీసుకోవడం కోసం ఒక అధికారిని కూడా నియ‌మించాల‌ని ఆదేశించారు. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని జగన్ అన్నారు.

You might also like