FbTelugu

కెసిఆర్ బంగ్లానా… నిజాం కోటనా?: సిపిఐ

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ తనకు తానుగా నిజాం నవాబు అనుకుంటున్నాడా? ఆయన మాదిరే ఇంటి చుట్టూ కోట నిర్మించుకుంటున్నారా? అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా విమర్శించారు.

బేగంపేటలో సిఎం క్యాంప్ కార్యాలయాన్ని (ప్రగతి భవన్) అభేద్యమైన పద్ధతుల్లో ఇనుప చట్రాల తో బిగించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. సగం రోడ్డును ఆక్రమించి ఇనుప కంచె నిర్మించారని, ఇది చాలదన్నట్లు సెంట్రల్ డివైడర్ పై మరో ఇనుప కంచే నిర్మాణం జరుగుతోందన్నారు. ఇదేమన్నా నిజాం నవాబు కోట? ఆయన ప్రజల మనిషి కాదు కాబట్టి ఆయనకు ఒకప్పుడు కోట ఉండేది. కెసిఆర్ ఇప్పుడు అదే మోడల్ లో కోట ఒకటి నిర్మిస్తున్నారు. మీరు ప్రజల ఓట్ల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డారనే విషయం మరిచిపోవద్దని నారాయణ హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రజలను చూస్తే మీకెందుకు భయం? అని నారాయణ నిలదీశారు.

ప్రజలను చూసి  భయపడేవారు ముఖ్యమంత్రిగా ఉండడం సాధ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కొంతమంది ఆత్మహత్యకు ప్రయత్నించారు, ధర్నాలు చేశారు. సమస్యలు పరిష్కారం చేస్తే ఇవి ఉండవు కదా అని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా ఇనుప గేట్లు పెట్టుకొని, పోలీసులను కాపలాగా పట్టుకొని ఫాంహౌస్ లో  పడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అని మండిపడ్డారు. నీ ఆలోచనలు, నీ దొరతనం చూసి జనం తిరగబడతారనే విషయం మరిచిపోవద్దు. నిజాం నవాబు కోటనే బద్దలు కొట్టిన వాళ్లకు ఇది ఒక లెక్కా? ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను, ప్రతిపక్షాలను నమ్మండని నారాయణ హితవు పలికారు. ఇలాంటి సంకుచిత ప్రయత్నాలు విరమించుకొని మీరు ప్రజలతో ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు. నన్ను ఎవరూ ప్రశ్నించవద్దని ఇనుప గేట్లు, సంకెళ్ళు, పోలీసులను పెట్టుకుంటే మిమ్మల్ని రక్షించడం ఎవరి సాధ్యం కాదని నారాయణ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.