FbTelugu

కేసీఆర్ సార్‌.. శిశుపాలుడెవ‌రూ?

కేసీఆర్ సార్‌కు కోపం వ‌చ్చింది. రాదా! అండీ.. బీజేపీ అంటే ఇప్ప‌టికే క‌డుపులో మండుతున్నా.. పైకి మాత్రం ప్రేమ న‌టించ‌టం ఎంత క‌ష్టం. ఓ పక్క‌.. అస‌దుద్దీన్  భాయ్ కూడా క‌య్ మంటున్నాడు.

లాక్‌డౌన్ 4.0 తరువాత ఇదంతా రాజ్యాంగ విరుద్ధ‌మంటూ అసుదుద్దీన్ గొంతుపెంచాడు. ముస్లిం మైనార్టీల‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ బోరుమ‌న్నాడు. మ‌రి సోద‌రుడు అలా బాధ‌గా ఉంటే.. కేసీఆర్ ఆ మాత్ర‌మైనా మోదీపై కోప్ప‌డ‌క‌పోతే బావుంటుందా! అయినా కేసీఆర్ స్ట‌యిలే వేరు. అవ‌కాశం వ‌చ్చిన‌పుడు తానే ఏం చెప్పాల‌నుకుంటున్నాడో చెప్పేస్తాడు.

త‌న ఇగో దెబ్బ‌తినేందుకు కార‌ణ‌మైన అంశాల‌ను కూడా వెలికితీసి మ‌రీ దుమ్మెత్తిపోస్తాడు. అందుకే… లాక్‌డౌన్ పై కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా మే 31 వ తేదీ వ‌ర‌కూ ఆంక్ష‌లు ఉంటాయంటూనే.. మోదీ సర్కారు తీరును తిట్టిపోశాడు. ఇదంతా స‌మాఖ్య రాజ్యానికి విరుద్ధ‌మంటూ గీరాలూ ప‌లికారు. కరోనాతో కుదేలైన రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నిధులు ఇవ్వాల్సిన కేంద్రం పైసా విద‌ల్సేదంటూనే.. రాష్ట్ర కేటాయింపుల‌న్నీ న‌గ‌దు రూపంలో ఉండాలంటూ కొత్త మెలికపెట్టాడు.

ఈ లెక్క‌న కేంద్రం ప్ర‌క‌టించిన రూ.20ల‌క్ష‌ల కోట్లు ఎవ‌రికి పోతున్నాయ‌నే ప్ర‌శ్న వేశాడు. ఎందుకు భ‌రిస్తున్నారంటూ అడిగితే.. శిశుపాలుడు వంద త‌ప్పుల వ‌ర‌కూ శ్రీకృష్ణుడు ఆగిన‌ట్టుగా.. తాము కూడా 100 త‌ప్పుల వ‌ర‌కూ వేచిచూస్తామంటున్నాడు. ఇంత‌కీ కేంద్రంలో శిశుపాలుడు ఎవ‌రు. . ఆయ‌న చేస్తున్న వంద త‌ప్పులేమిటీ అంటే మాత్రం స‌మాధానం లేదు. పైగా మీడియా వాళ్ల‌పై కూడా రుస‌రుస‌లాడాడు. ఎవ్వ‌రూ నోరెత్త‌కుండా త‌న‌దైన శైలిలో చెప్పుకుంటూ పోయాడు. సోనా బియ్యం నుంచి కాంగ్రెస్ రాజ‌కీయాల వ‌ర‌కూ మూడు నెల‌లుగా మ‌న‌సులో దాచుకున్న‌దంతా మీడియా స‌మావేశంలో కక్కేశారు. తాంబూలాలిచ్చాం.. త‌న్నుకు చావ‌మంటూ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌డ‌లించి, 17 వేల ప‌డ‌క‌లు రెఢీగా ఉంచామంటూ.. తేల్చిచెప్పారు.

You might also like