FbTelugu

అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందే: జగన్‌

తిరుపతి : రాష్ట్రంలో అన్యాయం ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు ముఖ్యంగా దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తిరుపతి పోలీస్ పరేడ్‌ మైదానం కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాల వేదికగా ఇవాళ ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, డీజీపీ సవాంగ్‌ ప్రారంభించగా.. సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మంచి పాలన చూసి ఓర్వలేకే విపక్షాలు కుట్రలు పన్నుతున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రజలపై ఎలాంటి వివక్ష చూపలేదన్నారు. తమకు పార్టీలు, కులాలు, మతాలు చూడాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా విశ్వసాలు దెబ్బతీసే విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్రేకాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికీ ఉపయోగం లేదన్నారు. దేవుడంటే భక్తి, భయం లేని పరిస్థితి నేడు నెలకొంది. రాజకీయాల కోసం దేవుణ్ని కూడా వదలడం లేదు. దేవుని ద్వారా రాజకీయాలు పొందే దారుణమైన క్లైమాక్స్‌లో మనం ఉన్నామన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు.

సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే విగ్రహాల ధ్వంసాలు జరగుతున్నాయని జగన్‌ అన్నారు. ఆలయాలను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ద్వజమెత్తారు. ఇప్పటికే 20 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందేనని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ పోలీసులు వెనకడుగు వేయకుండా గొప్పసేవలు అందించారన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్టేట్‌ పోలీస్ మీట్‌కు ఇగ్నైట్‌ అనే పేరు పెట్టినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.