FbTelugu

ఏలూరు బాధితులకు సీఎం జగన్ భరోసా

* అస్వస్థతకు గురైన వారిని పరామర్శించిన సీఎం

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏలూరులో వింత రోగంతో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ప్రభుత్వాస్పత్రిలో ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని, ఇతర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వివిధ రోగాలకు కారణమవుతున్న వైరస్‌లపై అన్ని పరీక్షలు చేయగా.. అవన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. బ్లడ్‌ కల్చర్‌ రిపోర్టు రావడానికి కొంత సమయం పడుతుందని, వాటి ఫలితాలకోసం వేచి చూస్తున్నట్టుగా తెలిపారు.

సీటీ స్కాన్‌ రిపోర్టులు కూడా సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. అస్వస్థతకు ఇంకా కారణాలు తెలియరాలేదని తెలిపారు. ఎయిమ్స్‌ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని, ఇవాళ ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్‌ నుంచి కూడా బృందాలు వస్తాయని తెలిపారు.
దీనిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఏలూరులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఎవరికి ఏం వచ్చినా 104, 108 నంబర్లకు కాల్‌చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అధికారులతో సమావేశమైనారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, శ్రీరంగనాథ రాజు తానేటి వనిత, పేర్నినాని, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనికుమార్‌ సింఘాల్, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సహా పలువురు అధికారులు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.