FbTelugu

పేదలకు సీఎం మరో తీపి కబురు

తాడేపల్లి: గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్లబకాయిలను చెల్లించాలని సీఎం జగన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో మొత్తం 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈచెల్లింపులు చేయాలని సీఎం సూచించారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని అన్నారు.

ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించారు. గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ సహా అధికారులు హాజరయ్యారు.

వైజాగ్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.

పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలి, గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలని జగన్ అన్నారు.

వైఎస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా జులై 8న పంపిణీ చేయనున్న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా సీఎం సమీక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వారి కేటాయించిన స్థలంవద్దే అక్కా, చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

You might also like