హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం మార్పు పై రాజకీయంగా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీవెనతోనే సీఎం గా కేటీఆర్ అవుతున్నారని అన్నారు.
బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే సీఎం కూర్చి నుంచి కేసీఆర్ దిగిపోయి, ఆయన కుమారుడికి పదవి ఇస్తున్నారని జగ్గారెడ్డి వివరించారు. ఈ పట్టాభిషేకం వెనకాల పెద్దన్నగా బీజేపీ, చిన్నన్నగా మజ్లిస్ పార్టీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఒకటేనని, బయట తిట్టుకోవడం, లోపల కలుసుకోవడం వీరి పని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి బుద్దిచెప్పే రోజులు త్వరలోనే వస్తాయని జగ్గారెడ్డి అన్నారు.
తన కుమారుడిని సీఎం కూర్చిలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారన్నారు. వారు అనుమతి ఇవ్వడం మూలంగానే కేసీఆర్ మంత్రులతో కేటీఆర్ భజన మొదలుపెట్టించారని జగ్గారెడ్డి ఆరోపించారు.