FbTelugu

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ అర్బిట్రేషన్‌ సెంటర్‌

సిజెఐ జస్టిస్‌ ఎన్.వి.రమణ వెల్లడి
హైదరాబాద్: పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిష్కారాల కోసం ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను (మధ్యవర్తిత్వ కేంద్రం) హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తెలిపారు.
మంగళవారం రాజ్‌భవన్‌ అతిథి గృహంలో జస్టిస్ ఎన్.వి.రమణ హైకోర్టు లీగల్‌ కరస్పాండెంట్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న తన కల సాకారం అవుతుందని జస్టిస్ రమణ అన్నారు. ఆర్బిట్రేషన్‌ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ అధికారి ఉంటారని చెప్పారు. ఇలాంటి వివాదాలను సింగపూర్‌ దేశం లోని ఇంటర్నేషన్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లో పరిష్కారానికి ఎంఎన్‌సి (బహుళ జాతి కంపెనీలు) సంస్థలు వెళ్తున్నాయని వివరించారు. అక్కడికి వెళ్లేందుకు భారీ మొత్తంలో న్యాయవాదులకు ఫీజులు, వాళ్లు ప్రయాణ ఖర్చులు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న హోటల్స్‌లో బస వంటివి ఖర్చు అవుతున్నాయని, అదే ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే అవన్నీ ఇక్కడకే వస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన అంశం గురించి సిఎం కెసిఆర్‌తో చర్చించినట్లు జస్టిస్ రమణ తెలిపారు.

దేశంలో ఎంఎన్‌సి కంపెనీల విదాదాలు ఎంత త్వరగా పరిష్కారమైతే అంతే వేగంగా హైదరాబాద్‌ లో కొత్తగా కంపెనీల ఏర్పాటుకు పలు దేశాలు ముందుకు వస్తాయని చెప్పారు. ఏదైనా కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ న్యాయ వివాదం ఏర్పడితే ఎన్నాళ్ల లోగా అవి పరిష్కారం అవుతాయో ఆరా తీస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులను బేరీజు వేసిన తర్వాతే ఐటీ, ఫార్మా, ఇండస్ట్రీస్‌ వంటి ఎంఎన్‌సి సంస్థల వివాదాలకు సత్వరమే ముగింపు పలకాలనే యోచనతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రతిపాదన అని ఆయన వివరించారు. కర్ణాటక, గుజరాత్‌ హైకోర్టులు విచారణను యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని, కేసుల అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజాహిత వ్యాజ్యాలు వంటివి సుప్రీంకోర్టు నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తే ప్రతిపాదన ఉందని జస్టిస్ రమణ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.