ఓ పక్క కరోనాతో ప్రపంచ దేశాలన్ని విలవిలలాడుతుంటే.. డ్రాగన్ మాత్రం భారత్ పై భారత సరిహద్దు వెంట భారీగా సైన్యాన్ని మొహరించి తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపుతోంది.
భారత్‌పైకి ఇప్పటికే నేపాల్‌ను ఉసిగొల్పి రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేయించింది. నేపాల్‌లో కరోనా ప్రబలడానికి భారత్‌నే కారణమని నేపాల్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజేశాయి. ఇప్పుడు చైనా నేరుగా దురాక్రమణకు పాల్పడుతూ యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇరు దేశాల మధ్య 1962లో చివరిసారిగా యుద్ధం జరిగింది. అప్పుడు కుదిరిన ఒప్పందం మేరకు ఇరు దేశాలు తూటాలు వాడరాదని నిర్ణయించి.. సరిహద్దులో ఎక్కడా తూటా పేలకుండా జాగ్రత్తపడ్డారు. కానీ గత వారం భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని భారత్ సైన్యం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. ముఖ్యంగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా భారత్ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోంది. రోడ్లు, వంతెనలు నిర్మిస్తోంది. దీనిపై డ్రాగన్ కంట్రీ తన అక్కసును ప్రదర్శిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని కొంత భూభాగం తనదేనని వాదిస్తూ రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని అడ్డుకుంటోంది. భారత్‌కు పోటీగా భారత్ భూభాగంలోకి వచ్చి మరీ రోడ్లు, వంతెనలు నిర్మించాలని ప్రయత్నిస్తోంది. దీనికితోడు నేపాల్, శ్రీలంకకు నిధులు సమకూరుస్తూ భారత్ నుంచి ఆ దేశాలకు ఉన్న స్నేహాన్ని వేరు చేసే దిశగా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్‌కు స్వయంగా నిధులు ఇచ్చి పెంచి పోషిస్తోంది.
ప్రస్తుతం యుద్దానికి సిద్ధంగా ఉండాలని చైనా సైన్యానికి అధ్యక్షుడు సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ సైన్యం భారత సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తోందని అధికారులు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇప్పటికే చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.