FbTelugu

ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: కెసిఆర్

హైదరాబాద్: అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ.2500 కోట్ల కు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని ఆయన స్సప్టం చేశారు.

స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని అన్నారు. వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని, మిగతా ఇలా మొత్తం అందరికీ అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందనీ ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయన్నారు. రెండు-మూడు రోజుల్లో తనకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని సిఎం అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమం పటిష్టంగా, విజయవంతంగా అమలు చేయడానికి జిల్లాలవారీగా ఇంచార్జులను నియమించడం కూడా జరుగుతుందని సిఎం చెప్పారు.
వాక్సినేషన్ కార్యక్రమంతో పాటు, రెమెడిసివిర్ తదితర కరోనా సంబంధిత మందులకు, ఆక్సిజన్ కు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని సిఎం తెలిపారు. ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తుందనన్నారు. ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. పెద్ద ఎత్తున గుంపు-గుంపులుగా కూడవద్దని, ఊరేగింపులలో పాల్గొనవద్దని, అత్యవసరమైతేనే తప్ప బయట తిరగవద్దని, స్వయం క్రమశిక్షణ పాటించాలని ప్రజలకు కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.