FbTelugu

ఇక వాటితోనే నెట్టుకొస్తారా..?

తెలంగాణ సీఎం కేసీఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. తనకు దూరమవుతున్న ప్రజలను తిరిగి తనవైపు తిప్పుకునేందుకు సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేయాలన్న నిర్ణయానికి వచ్చారన్న చర్చ జోరుగా సాగుతోంది. సమయం ఎక్కువగా పట్టే అభివృద్ధి కార్యక్రమాలను పక్కనబెట్టి త్వరగా లబ్ధి చేకూర్చేవాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే వివిధ వర్గాల ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి కొత్త సంవత్సరం భారీ గిఫ్ట్‌ను ప్రకటించారు. వాస్తవానికి ఉద్యోగులు, యువత టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఫలితాలు ప్రతి ఎన్నికలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాజయమే ఎదురవుతోంది.

సాధారణ ఎన్నికల్లోనూ ఉద్యోగులు వేసే బ్యాలెట్‌ ఓట్లలో కూడా టీఆర్‌ఎస్‌ చాలా వెనుకబడి ఉంటోంది. అది తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బయటపడింది. దీంతో వారిని మచ్చిక చేసుకునే పనిలో కేసీఆర్‌ పడ్డారు. యువత నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రాష్ట్రంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని కేసీఆర్‌ సర్కారు భర్తీ చేయడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులతోనే కాలం గడుపుతోంది. యువత ఎన్నిసార్లు ఆందోళనలకు దిగినా కేసీఆర్‌ పట్టించుకోలేదు. దీంతో యువత అంతా కేసీఆర్‌కు వ్యతిరేకంగా తయారైంది. దీంతో వారిని మచ్చిక చేసుకునే ప్లాన్‌లో కేసీఆర్‌ పడ్డారు. అందుకే రాష్ట్రంలో 65వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి నుంచి వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వేయాలని నిర్ణయించారు. వీటి నిర్వహణకు ఓ కమిటీని కూడా వేశారు. ఇక, ఉద్యోగులు.. ఇతర రంగాల వారిని మచ్చిక చేసుకునేందుకు తాజాగా వారికి వరాల వర్షం కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రంగాల్లో కాంటాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు.

ఇతర పద్ధతుల్లో పని చేస్తున్న వారికి కూడా వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇవన్నీ అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరం. అయితే, వివిధ ప్రాజెక్టులను నిర్మిస్తూ వీటిని అమలు చేయడం కష్టసాధ్యమైన పని. అందుకే ప్రస్తుతానికి పెద్ద ప్రాజెక్టులను పక్కనబెట్టి తక్షణం లబ్ధికలిగే ప«థకాలపైనే సీఎం కేసీఆర్‌ కన్నేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు బండిని ఇలాగే లాగి ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి అప్పుడు ప్రాజెక్టు పనులను చూసుకోవచ్చన్న భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలంటే పెద్ద ప్రాజెక్టుల కంటే తాత్కాలికంగా వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేయడమే మంచిదన్న భావనలో గులాబీ నేత ఉన్నట్టు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.