FbTelugu

సెట్ పరీక్షల వేళల్లో మార్పు

అమరావతి: ఎంసెట్‌ సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల వేళల్లో మార్పులు చేయనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయాల్సి ఉంటుంది.
వచ్చే నెల 10 నుంచి ప్రారంభమయ్యే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అక్టోబరు 5తో ముగియనున్నాయి. రెండు విడతల (సెషన్‌) మధ్య 3గంటల సమయం అవసరం కానున్నందున పరీక్షల సమయాలను సరి చేస్తున్నారు. గతంలో ఎంసెట్‌ ఒక విడత ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, రెండో విడత మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించారు. ఈసారి ఉదయం 9గంటల నుంచి, మధ్యాహ్నం 3గంటల నుంచి పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల విధానాన్ని పూర్తిగా నిలిపేయనున్నారు. విద్యార్థులకు సమాచారమిచ్చేందుకు వాలంటీర్లను నియమిస్తున్నారు. అభ్యర్థులు కేంద్రం వద్దకు చేరుకోగానే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. ఆ తరువాత హాల్‌టిక్కెట్‌పై ఉండే బార్‌కోడ్‌ ఆధారంగా పరీక్షా గది తెలియచేస్తారు. కరోనా లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కేంద్రంలోవిధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందిస్తారు.

కరోనా బారినపడి ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఉన్న వారు సమాచారాన్ని కన్వీనర్లకు అందిస్తే వారు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. విద్యార్థుల మధ్య భౌతికదూరం, శానిటైజర్లు సమకూర్చుతారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చర్యలు తీసుకోనున్నారు.

You might also like