FbTelugu

సెంచరీల మోత !

107,117,122,199. ఏమిటీ సంఖ్యలు. ఇదేమైనా క్రికెట్‌ స్కోరు అనుకుంటున్నారా.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో సెంచరీల మోత మోగుతోంది. సెంచరీల మోత అంటే క్రికెట్‌ ఆట అనుకుంటున్నారా..? లాక్‌డౌన్‌ కాలంలో ఆటలన్నీ అటకెక్కాయి కదా.. మరి సెంచరీల మోత మోగేదెక్కడ అనుకుంటున్నారా..? సెంచరీల మోత మోగేది క్రికెట్‌ ఆటలో కాదండి.

కరోనా పాజిటివ్‌ కేసుల్లో. ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ వందకు పైగానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరగడం తప్ప తగ్గడం లేదు. తెలంగాణలో అయితే ఒకేరోజు 199 (డబుల్‌ సెంచరీకి ఒకటి తక్కువ) కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభంలో తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రెండు ప్రభుత్వాలు చాలా తక్కువగా అంచనా వేశాయి. ఒక సీఎం పారాసిటమాల్‌ మాత్ర వేసుకుంటే తగ్గే జ్వరానికి ఇంత హైరానా పడాలా అన్నారు. మరో సీఎం బ్లీచింగ్‌ చల్లితే వైరస్‌ పరారవుతుంది.

దానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కానీ, ఇప్పుడు అదే వైరస్‌ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. పాజిటివ్‌ కేసులు క్రికెట్‌లో ధోనీ స్కోరులా పెరిగిపోతున్నాయి. వాటిని నిలువరించేందుకు ఈ రెండు ప్రభుత్వాలు ఎంతమంది చేయితిరిగిన బౌలర్ల లాంటి డాక్టర్లను రంగంలోకి దించినా ఫలితం ఉండడం లేదు. పైగా వీటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. సాధారణంగా క్రికెట్‌ అభిమానులు క్రికెట్‌ జరిగే కాలంలో ఈ రోజు ఇండియా స్కోరెంత.. బ్యాటింగ్‌ ఎవరు చేస్తున్నారు అని మాట్లాడుకునే వారు. ఇప్పుడు అదే ప్రజలు ఇవాళ తెలంగాణలో స్కోరెంత (కరోనా కేసులు), ఏపీలో ఎన్ని వికెట్లు పడిపోయాయి (మృతులు) అన్న రీతిలో మాట్లాడుకుంటున్నారు.

ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా ఇప్పట్లో పోయేదికాదు.. దానిని ఆపే శక్తి ప్రభుత్వాలకు లేదని తేల్చి చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే కరోనా నియంత్రణపై సర్కారు చేతులెత్తేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు మేథావులు భావిస్తున్నారు. రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రాల్లో ఇలా వందల సంఖ్యలో కేసులు నమోదవడాన్ని చూస్తున్న జనం మాత్రం ఆందోళనతో భయం భయంగా జీవనం గడుపుతున్నారు.

You might also like