FbTelugu

తర్వాత తెలంగాణకేనా..?

కేంద్రం వరుసగా ఆస్తులన్నింటీనీ అమ్ముకుంటూ పోతోంది. ఇప్పుడు తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏపీ ప్రజలు ఆందోళనకు దిగారు. రోజూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూనే ఉన్నారు. టీడీపీ విశాఖ ఎమ్మెల్యే గంటా తన పదవికి కూడా రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉక్కు పోరాటానికి మద్దతు తెలపాలని అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పోరాటానికి మద్దతుగా రాష్ట్ర బంద్‌ కూడా నిర్వహించారు. అయినా, కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా విశాఖ ఉక్కు పరిశ్రమను వందశాతం ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం ఖాయమని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీ అమ్మడం ఖాయమన్న పరిస్థితికి అంతా వచ్చారు. ఇప్పటికే నష్టాల పేరుతో అనేక కేంద్ర సంస్థలను అమ్మేశారు. ఇప్పుడు కొత్తగా విశాఖ ఉక్కును కూడా అమ్ముతున్నారు. ఇలా వరుసగా ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న కేంద్ర సర్కారు ఉక్కు పరిశ్రమ తర్వాత ఇంకా వేటిని అమ్మకాలకు పెడుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే బీజేపీ సర్కారు ఏయే సంస్థలను అమ్మాలో ఇప్పటికే ఓ ప్రణాళికను తయారు చేసుకుందని, విశాఖ ఉక్కు తర్వాత ఆ సర్కారు కన్ను తెలంగాణపై పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు తర్వాత తెలంగాణలోని సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌ను అమ్మకానికి పెట్టడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే తెలంగాణకు పెద్ద నష్టమే. ఈ రెండు పరిశ్రమల్లో వేలాది మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు ఆ పరిశ్రమల వల్ల ఇన్‌డైరెక్టుగా లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌లను కూడా అమ్మితే అది తెలంగాణలో నిరుద్యోగం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సర్కారు ఆందోళన పడుతున్నట్టు సమాచారం. దీనిని అడ్డుకునేందుకు ఇప్పటినుంచే కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగితే తెలంగాణతో పాటు ఏపీ సహకారం కూడా తీసుకునేందుకు పావులు కదుపుతున్నారనన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముందస్తుగా కేటీఆర్‌ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడమే కాకుండా.. అవసరమైతే నేరుగా అక్కడికి వచ్చి ఉద్యమంలో పాల్గొంటానని వ్యాఖ్యానించారని చెబుతున్నారు. ఒకవేళ రేపు బీహెచ్‌ఈఎల్, సింగరేణికి కూడా ఇదే పరిస్థితి ఎదురైతే అక్కడి నాయకులను కూడా ఇక్కడి ఆందోళనకు పిలవవచ్చన్న ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ ఉక్కు అమ్మకంతో తెలంగాణలోని ప్రాజెక్టులను కూడా అమ్ముతారన్న భయం తెలంగాణ సర్కారుకు పట్టుకుంది. ఏదైమైనా ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరికొకరు సహకరించుకోవడం శుభ పరిణామమే.

You might also like

Leave A Reply

Your email address will not be published.