FbTelugu

సుశాంత్ సింగ్ మృతిపై సిబీఐ విచారణ

సుప్రీంకోర్టుకు తెలిపిన సోలిసిటర్ జనరల్

ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై రోజుకో కథనం రావడం, వివాదాలు చెలరేగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బిహార్ ప్రభుత్వం వినతి మేరకు సీబీఐ విచారణకు ఆదేశించినట్లు సుప్రీంకోర్టుకు తెలియచేసింది.
తనపై దర్యాప్తును బిహార్ లోని పాట్నా నుంచి ముంబై కి మార్చాలంటూ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసు ప్రకారం కేంద్ర ప్రభుత్వం సిబీఐ విచారణకు అంగీకరించిందన్నారు.

అనుమానాస్పదస్థితిలో మరణించిన కేసులో నిజానిజాలు బయటకు రావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ కోసం ముంబై వెళ్లిన విచారణ అధికారి, ఐపీఎస్ ను హోం క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని ఘాటుగా మందలించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై మూడు రోజుల్లో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది.

You might also like