FbTelugu

నేడు జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ

CBI-court-to-hear-Jagans-petition-today

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవ్వాళ తీర్పు వెలువరించనుంది. దీనిపై సీబీఐ న్యాయస్థానంలో గత నెల 18న ఇరువైపుల వాదనలు ముగిశాయి. కాగా ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో కోరారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. విజయవాడ నుంచి హైదరాబాద్​లోని కోర్టుకు హాజరు కావడానికి సుమారు రెండు రోజులు పడుతోందని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి ఉందన్నారు. మరోవైపు జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఇప్పుడు సీఎం జగన్​కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వాదించింది సీబీఐ. సీఎం జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. సీఎం అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ బలంగా వాదనలు వినిపించింది. గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసినందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు… నేడు తుది తీర్పును వెల్లడించనుంది.

You might also like