FbTelugu

అంత ప్రేమ భరించలేను… విడాకులు ఇప్పించండి!

లక్నో: కోపం లేదు… ఎప్పుడూ ప్రేమనే చూపిస్తాడు… చిన్న మాట కూడా అనడు. ఈయన నాకొద్దు అంటూ ఒక వివాహిత మహిళ షరియా కోర్టుకు ఎక్కింది. తనకు విడాకులు ఇప్పంచాలని ఆమె కోరడంతో షరియా పెద్దలు బిత్తరపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సంభల్ జిల్లాకు చెందిన ఒక మహిళ 18 నెలల క్రితం ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నది. ఏడాదిన్నర పాటు ఇద్దరు బాగానే ఉన్నారు. ఇటీవల ఆ మహిళ షరియా కోర్టును ఆశ్రయించింది. భార్యభర్తల మధ్య తగవులు కావొచ్చు అని పెద్దలు భావించారు. కాని దానికి విరుద్ధంగా ఆమె చెప్పిన మాటలు విని నోరు పెగల్లేదు. తన భర్త ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోపగించుకోలేదు. ప్రతిదీ కరెక్టు అని ఒప్పుకుంటాడు. తప్పు చేసినా క్షమించి, పట్టించుకోడు. సరదాకైనా గొడవ పడాలని ప్రతి మహిళకు ఉంటుందని, అలా కూడా చేయడం లేదని పేర్కొంది. కావాలని గోల చేసినా, గొడవ పెట్టుకున్నా ఆయనే వెనక్కి తగ్గుతాడు. కోపతాపాలు లేని ఇలాంటి భర్తతో సంసారం చేయను అంటూ పెద్దలకు తెగేసి చెప్పింది.

ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని అడగ్గా లేవని, విడాకులు ఇప్పిస్తే వెళ్లిపోతాను అని చెప్పింది. ఈ విషయంలో తామేమి చేయలేమని షరియా కోర్టు చేతులు ఎత్తేసింది. ఈ పంచాయతీ స్థానిక పెద్దల వద్దకు చేరింది. వాళ్ల వద్ద కూడా ఇదే మొరపెట్టుకున్నది. తాము కూడా ఏమీ చేయలేమని, కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలంటూ చెప్పి పంపించేశారు.

You might also like