గుంటూరు: టీడీఎల్పీ ఉపనేత కె. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. సుధాకర్ తెలిపారు.
రెండు లేదా మూడు రోజుల్లో ఆయన గాయం నయమయ్యే అవకాశం ఉందన్నారు. శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గాన ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగిందన్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈఎస్ఐ కేసులో ఆయనను అరెస్టు చేసి తీసుకురావడం వల్ల గాయం మరింతగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చన్నారు. అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదన్నారు. ఆయనకు ఉన్న నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుందని డా.సుధాకర్ వివరించారు. పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చు అన్నారు.
14 రోజులు ఏసీబీ కోర్టు రిమాండ్…
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అచ్చెన్నాయుడితో పాటు మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరుచినట్లు అధికారులు తెలిపారు. 14 రోజుల పాటు వీరిద్దరికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినట్లు చెప్పారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి బాలేనందున గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలనీ ఏసీబీ కోర్టు ఆదేశించిందని వారు తెలిపారు. చికిత్స అనంతరం అచ్చెన్నాయుడును జైలుకు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రమేష్ కుమార్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు.