FbTelugu

ఆన్ లైన్  క్లాసులకు కేబినెట్ ఆమోదం

ప్రగతి భవన్ లో అర్థరాత్రి వరకు కొనసాగిన కేబినెట్

ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలకు ప్రోత్సాహం

భవనాల అనుమతికి టీఎస్ బి పాస్ అమలు

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

ప్రగతి భవన్ లో బుధవారం అర్థరాత్రి వరకు కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన ఏజెండా అంశాలు ఇలా ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసుల కోసం సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.

సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి, డిజైన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తెలంగాణ రాష్ర్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది.

వ్యవసాయం లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు పెట్టాలనే కేసీఆర్ నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక విధానం తయారు చేయాలని నిర్ణయించింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టిఎస్ బి పాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టిఎస్ ఐపాస్ లాగానే టిఎస్ బి పాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది.

దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గతంలో ఉన్న విద్యుత్ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికి రాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

You might also like