FbTelugu

ఆ విషయంలో దూసుకుపోతున్న ఏపీ!

ఆంధ్రప్రదేశ్‌ ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. కానీ, దీనివల్ల ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదేంటి.. అన్ని రాష్ట్రాల కంటే తమ రాష్ట్రం దూసుకుపోతుంటే ఆనందించాలి కానీ, ఆందోళన ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఇక్కడే ఉందండీ అసలు తిరకాసు. ఆ రాష్ట్రం దూసుకుపోతోంది అభివృద్ధిలోనో.. మరే ఇతర మంచి విషయంలోనో కాదు.. కరోనా కేసుల్లో. అదే అక్కడి ప్రజల ఆందోళన. దేశంలోనే ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలోకి చేరింది. ఇంకా అక్కడ రోజుకు 8వేల నుంచి పదివేల దాకా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రెండో రాష్ట్రంగా తమిళనాడు ఉంది. మొన్నటి దాకా మూడోస్థానంలో కర్ణాటక ఉంది. అయితే, ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ దక్కించుకుంది.

ఇక మరణాల్లో ఏపీ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. ఐదోస్థానంలో ఉన్న గుజరాత్‌లో ఇప్పటివరకు 2,765మంది మరణించగా, ఏపీలో 2,700దాకా మరణాలు సంభవించాయి. దీంతో మరణాల్లోనూ త్వరలోనే గుజరాత్‌ను దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు పాజిటివ్‌ కేసుల్లో మొదటిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో సుమారు 6లక్షల దాకా కేసులు నమోదు కాగా, ఇక్కడ సుమారు 20వేల మంది మృత్యువాత పడ్డారు.

రెండోస్థానంలో ఉన్న తమిళనాడులో సుమారు మూడున్నర లక్షల కేసులు నమోదు కాగా ఆరువేల దాకా మరణాలు సంభవించాయి. ఇక, మూడో స్థానంలో ఉన్న ఏపీలో సుమారు 3లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. 2700కు పైగా మరణాలు సంభవించాయి. ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనానుంచి ఎప్పుడు బయటపడతామోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

You might also like