FbTelugu

వారెవ్వా.. ఏమి ప్లాను బాసూ..!

ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఆశ.. దోసె.. అప్పడం.. వడ అని హేళన చేస్తుంటాం. ఓ తెలుగు సినిమాలో కూడా ఈ పదాన్ని పెట్టారు. ఈ పదం ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే, ఇప్పుడు అక్కడ అవన్నీ లేవు గానీ అందరినీ ఆకర్షించే దోసె మాత్రం దొరుకుతోంది. అది కూడా తనకిష్టమైన రాజకీయ పార్టీల గుర్తుతో. ఇంకేముంది ఓటర్లు తమ పార్టీ గుర్తుతో ఉండే ఆ దోసె కోసం బారులుదీరుతున్నారు. శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు వైవిధ్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కొల్లాం బీచ్‌ రోడ్‌లోని ఓ హోటల్‌ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు ఎన్నికలనే మార్గంగా చేసుకున్నారు. ప్రధాన పార్టీల గుర్తులతో అల్పాహారం తయారు చేస్తూ గిరాకీ పెంచుకుంటున్నారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అల్పాహార ప్రియులను మరింత ఆకట్టుకునేలా రాజకీయపార్టీ గుర్తులతో దోశలను తయారు చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ గుర్తులతో ఈ దోశలు వేస్తున్నారు. దోశలపై పార్టీ గుర్తులను వేసేందుకు క్యారెట్‌ ముక్కలు, టొమాటో సాస్‌ వాడుతున్నారు. ఈ వినూత్న దోశలకు ఎన్నికల వేళ డిమాండ్‌ పెరిగిందని, గతం కన్నా ఎక్కువ ఆర్డర్లు వస్తున్నట్లు హోటల్‌ యజమాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కవి శ్రీశ్రీ చెప్పినట్టు కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్షం అన్నట్టు ఈ హోటల్‌ యజమాని కూడా కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టుగా ప్లాన్‌ చేశాడు. ఎన్నికలను తన వ్యాపారానికి ఎలా మలుచుకున్నాడో చూసిన వారు వారెవ్వా అనాల్సిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.