FbTelugu

ఆరో వాయిదాకు ఎమ్మెల్సీల డుమ్మా: బుద్దా వెంకన్న

అమరావతి: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ రెడ్డిలు ఈ రోజు కూడా విచారణకు గైర్హాజరు అయ్యారు

మండలి ఛైర్మన్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ముందు హాజరు కావాల్సిందిగా ఇద్దరి ఎమ్మెల్సీలకు నోటీసులు వెళ్లాయన్నారు. అనర్హత పిటిషన్‌లపై ఛైర్మన్ వద్ద జరిగే విచారణకు హాజరు కావాలని కోరారు. టీడీపీ తరపున నేను, అశోక్ బాబు విచారణకు హాజరయ్యారన్నారు. అయితే వీరిద్దరు ఆరోసారి కూడా హాజరు కాకుండా తమ అడ్వకేట్లను పంపించడం శోచనీయమన్నారు.

ఈ సందర్భంగా బుద్దా మీడియాతో మాట్లాడారు. పోతుల, శివనాథ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరవ వాయిదాకి కూడా ఆరోగ్య కారణాలు చూపుతూ వారు హజరుకాలేదని సిగ్గుచేటని విమర్శించారు. విచారణకు హాజరైతే పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందని.. అందుకే కుంటి సాకులతో భయపడి రావడంలేదని ఆరోపించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి వెళితే ఆ విషయం ఛైర్మన్‌కు వచ్చి ధైర్యంగా చెప్పుకోవచ్చుగా అని బుద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు పిలిచిన ఐదు వాయిదాలకు వారు హాజరవ్వకుండా అడ్వకేట్లను పంపడం పిరికితనంతో సమానమన్నారు. గైర్హాజరు అవుతున్నందున వచ్చే వాయిదాలో అనర్హత పిటిషన్‌పై ఛైర్మన్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు బుద్దా వెంకన్న తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.