FbTelugu

తమ్ముడి నిర్ణయం.. అన్నకు అవస్థలు

ఉరిమి ఉరిమి మంగలం మీద పడిందనేది పాతకాలం నాటి సామెత. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న సామెత కూడా ఈయనకు సరిగ్గా సరిపోతుంది. తమ్ముడి నిర్ణయం ఓ అన్నకు తలనొప్పులు తెచ్చిపెడుతోందట.

ఎవరీ అన్నదమ్ములు.. ఏమిటా కథ. ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. కాంగ్రెస్‌ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ది ప్రధాన పాత్రే. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వీరికి అనుచరగణం బాగానే ఉంది. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా విజయం సాధిస్తే.. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అన్న వెంకటరెడ్డి పీసీసీ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి తనకు సపోర్టు చేయకపోగా భవిష్యత్‌లో తానే బీజేపీలో చేరతానని బాంబ్‌ పేల్చారు. ఇదే ఇప్పుడు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆటంకంగా మారింది.

వాస్తవానికి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఎప్పటినుంచో పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఆయన భవిష్యత్‌లో బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. ఇదే ఇప్పుడు అన్న వెంకటరెడ్డికి తలనొప్పిగా మారింది. తాను పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న తరుణంలో తమ్ముడి వ్యాఖ్యలు తనకు ప్రతికూలంగా మారాయని వెంకటరెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్టు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్‌తో పాటు పార్టీ అధిష్టానం వద్ద కూడా వెంకటరెడ్డికి మంచి పట్టు ఉండేది. గతంలో ఆయన పట్టుబట్టి తన తమ్ముడితో పాటు అనుచరులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇప్పించుకోవడంతో పాటు వారి విజయంలోనూ కీలకంగా వ్యవహరించారు.

అయితే, ఇప్పుడు సొంత తమ్ముడే వెంకటరెడ్డి మాట కాదని కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరతానని ప్రకటించడంతో వెంకటరెడ్డికి పార్టీలో ఇబ్బందులు తప్పేలా లేవన్న చర్చ సాగుతోంది. ఒకవేళ పీసీసీ పీఠం అప్పగిస్తే సొంత తమ్ముడినే పార్టీ నుంచి బయటకు పోకుండా కాపాడలేని వెంకటరెడ్డి ఇక పార్టీని ఎలా కాపాడతారని ఆయన వ్యతిరేకులు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. దీంతో భవిష్యత్‌లోనూ పార్టీలో తన ఆధిపత్యానికి గండి పడినట్టేనన్న ఆందోళనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టు ఆయన అనుచరులు గుసగుసలాడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.