FbTelugu

యుపి నాలుగు ముక్కలవుతోందా?!

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా యుపి లో నాయకత్వ మార్పిడి, నూతన క్యాబినెట్ కూర్పు అని వార్తలు చక్కర్లు కొడుతుండగా… అసలు విషయం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బిజెపి అధిష్టానంతో సిఎం యోగి ఆదిత్యానాథ్ విభేధించారని, కాంగ్రెస్ నాయకుడు  జితెన్ ప్రసాద్ రాకతో మార్పులు జరుగుతున్నాయని, కేంద్ర మాజీ మంత్రి అనుప్రియా పటేల్ హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీలో మతలబు ఉందని ఇలా రకరకాలుగా వార్తలొస్తున్నాయి. కాని అసలు విషయం మాత్రం బిజెపి పెద్దలు బయటకు పొక్కకుండా సినిమా స్టార్ట్ చేశారని అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 సీట్లు ఉన్నాయి. 2017 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 324 స్థానాలు, సమాజ్ వాది అండ్ కాంగ్రెస్ కలిపి 55, బి.ఎస్.పి 19, ఇతరులు 5 సీట్లలో విజయం సాధించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి విజయబావుటా ఎగురవేసేందుకు కాషాయ పెద్దలు పదునైన వ్యూహం రచించి అమలుచేయనున్నారు.

ఉత్తరప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించి అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే వ్యూహం తో కదలనున్నది. ఇందుకోసం యోగి ఆదిత్యానాథ్ ను ఢిల్లీకి పిలిపించి చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ పరాభవాన్ని పరిగణనలోకి తీసుకుని పావులు కదుపుతున్నారు. యోగి మొండితనం, లెక్కలేనితనం, కరోనా నియంత్రణలో వైఫల్యం, అభివృద్ధి లేకపోవడంతో బిజెపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి దాదాపు తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్నది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో సమాజ్ వాది పార్టీ హవా కొనసాగింది. ఈ ఊపు అసెంబ్లీ ఎన్నికల నాటికి పెరిగి సమాజ్ వాది పుంజుకుని అసలుకే మోసం జరుగుతుందేమనన్న భయంతో బిజెపి పెద్దలు కలవరపడుతున్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సిఎం యోగి ఆదిత్యానాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్ పూర్ సహా 23 జిల్లాలతో పూర్వాంచల్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కానున్నది. ఒకవేళ ఏర్పాటు అయితే 125 అసెంబ్లీ సీట్లు ఉండనున్నాయి. అయితే పూర్వాంచల్ అభివృద్ధి కోసం యోగి సర్కార్ 28 జిల్లాలను ఎంపిక చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. ఇదే కాకుండా అవధ్ ప్రదేశ్ 24 జిల్లాలు, బుందేల్ ఖండ్ 7 జిల్లాలు, పశ్చిమ ప్రదేశ్ 22 జిల్లాలతో రాష్ట్రాలు ఏర్పాటు కానున్నాయి. బుందేల్ ఖండ్, హరిత ప్రదేశ్, పూర్వాంచల్ రాష్ట్రాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర విభజనపై ఇప్పటికే బిజెపి పెద్దలు బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకున్నారు. ఏ రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది కూడా ఖరారు అయిందంటున్నారు. అయితే ఈ ప్రతిపాదనలను యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రాన్ని విభజించాలని మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది. అప్పటి యుపిఏ2 ప్రభుత్వం మాయావతి ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసి, కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే విభజించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.