FbTelugu

ఆ రెండూ ఖాయమైనట్టేనట!

తెలంగాణలోని కాంగ్రెస్‌ పార్టీలో ఆ రెండు విషయాలు ఖాయమైనట్టేనని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అందులో ఒకటి విజయశాంతి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం. రెండోది టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డికి అప్పగించడం. విజయశాంతి ఇప్పటికే అనేకసార్లు బీజేపీ నేతలతో మాట్లాడారని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా జరిపిన చర్చలు సఫలమయ్యాయని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఆమెకు గౌరవమైన స్థానం ఇస్తామని కమలనాథులు హామీ ఇవ్వడంతో ఆమె ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

త్వరలో మంచి ముహూర్తం చూసుకొని కమలదళంలో కలవనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ నేతలు మాత్రం జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందే పార్టీలోకి వస్తే ఈ ఎన్నికల్లో బాగా లబ్ధి కలుగుతుందన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, విజయశాంతి మాత్రం మంచి ముహూర్తం చూసుకొని బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక, టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా రేవంత్‌రెడ్డికి ఖాయమని, ఈ మేరకు సోనియా కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు కూడా ఆ పార్టీ పీసీసీ నేతలు చెప్పుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా చేసి చాలా కాలమైంది. ఈ పదవిని ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు. వాస్తవానికి ఈ పదవికోసం కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి లాంటి నేతలు ఎంతోమంది పోటీ పడుతున్నారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఆచితూచి అడుగేసేందుకు సమయం తీసుకుంది. కానీ, దుబ్బాక ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి కొత్త రథసారథి కావాలని అధిష్టానం తలంచింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కూడా అధిష్టానం వద్ద ఉంచారట.

దీంతో, ఇప్పుడు కేసీఆర్‌ను ఢీకొనగలిగిన దమ్మున్న నేత రేవంత్‌రెడ్డి అని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. ఆయనకంటే టీఆర్‌ఎస్‌ను ఢీకొనే సత్తాతో పాటు టీఆర్‌ఎస్‌ను ఎండగట్టడంలో ముందుండడం.. సబ్జెక్టు పరంగా, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంలాంటి విషయాల్లో చూస్తే ఇప్పుడు పార్టీకి రేవంత్‌లాంటి నాయకుడే కావాలని అధిష్టానం భావించినట్టు సమాచారం. అందుకే కొత్తగా పార్టీలోకి వచ్చినా అలాంటి నేతకే పార్టీ పగ్గాలు అప్పగించాలని, అది కూడా ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. పీసీసీ నేతగా రేవంత్‌ను ఎంత త్వరగా ప్రకటిస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీకి అంత లాభం కలుగుతుందని కార్యకర్తలు కూడా భావిస్తున్నారట.

You might also like

Leave A Reply

Your email address will not be published.