FbTelugu

ఒకే ఇంటినుంచి 32 పాస్ పోర్టులు

బోధన్ పాస్ పోర్టుల కుంభకోణం
నిజామాబాద్: ఒకటి కాదు రెండు ఏకంగా 32 పాస్ పోర్టులు ఒకే ఇంటి నుంచి జారీ అయ్యాయి. అది కూడా ఒక పోలీసు అధికారి నివాసం కావడం సంచలనం రేపుతున్నది. అక్రమ పాస్ పోర్టుల వ్యవహారం లో తీగ లాగితే డొంక కదిలింది.

ఈ వ్యవహారంలో ఒక ఎస్సై, ఏఎస్సైని హోం శాఖ సస్పెండ్ చేసింది. బోధన్ పట్టణంలో ఏఎస్సైగా మల్లేష్ పనిచేస్తుండే వాడు. తన ఇంటి పేరు మీద సుమారు 32 మందికి పాస్ పోర్టులు ఇప్పించాడు. ఇతనికి కానిస్టేబుల్ అనీల్ కుమార్ సహకరించాడు. వీరి వ్యవహారం అటు పోలీసు శాఖ కాని ఇటు పాస్ పోర్టు అధికారులు కాని పట్టించుకోలేదు. ఒకే ఇంటి నుంచి ఇంత సంఖ్యలో దరఖాస్తులు ఎలా వస్తున్నాయని స్పెషల్ బ్రాంచి పోలీసులు కూడా పట్టించుకోకపోవడం దారుణం. ఇలా పాస్ పోర్టు పొందిన వారిలో ఇద్దరిని హైదారాబాద్ ఏయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

బంగ్లాదేశీయులు అయిన వీరికి పాస్ పోర్టులు ఎలా వచ్చాయంటూ ఏయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అన్ని విషయాలను బంగ్లాదేశీయులు పూసగుచ్చి వివరించడంతో ఏఎస్సై మల్లేష్, కానిస్టేబుల్ అనీల్ భాగోతం బయటపడింది. తమ వద్ద లక్షలాది రూపాయలు తీసుకుని పాస్ పోర్టులు ఇప్పించారని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఏయిర్ పోర్టు భద్రతా సిబ్బంది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, తెలంగాణ పోలీసు డీజీపీకి, హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్టు అధికారులకు తెలియచేసింది.
విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు సిద్దిపేట ఎస్సై గా పనిచేస్తున్న మల్లేష్, ఏఎస్సై అనీల్ లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో రోహింగ్యాలకు పాస్ పోర్టులు జారీ చేస్తున్నారని ఆదివారం నాడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. విదేశీయులైన ముస్లింలకు ఇక్కడి నుంచి సులువుగా పాస్ పోర్టులు అందుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.