FbTelugu

కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న కెసిఆర్: బండి సంజయ్

హైదరాబాద్: సిఎం కెసిఆర్ జిల్లా కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం అత్యంత సిగ్గుచేటు, అమానవీయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌ ఆఫీసర్లందరూ కేసీఆర్‌ చర్యల పట్ల సిగ్గుపడుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ శరత్ లు కాళ్లు మొక్కారని బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గతంలోనూ కాళ్లు మొక్కి ఐఏఎస్ ల పరువు తీశారన్నారు. కెసిఆర్ తనను తాను రాజుగా అభివర్ణించుకుంటూ, ఫ్యూడల్ పోకడలను అనుసరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీకి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొరకడం లేదని, వెతుకులాడుతున్నారని అన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురడం ఖాయమని, టిఆర్ఎస్ పార్టీ కోట్లు ఖర్చు పెట్టినా, ముఖ్య నాయకులకు ఖరీదైన కార్లు కొనిచ్చినా డిపాజిట్‌ దక్కదన్నారు. తెలంగాణ సాధనలో బిజెపిది కీలక పాత్ర అని, కేంద్ర నాయకురాలు సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపి లో చేరగానే సిఎం కెసిఆర్ కు భయం పట్టుకుందుని, నిన్నటి వరకు గడీలోనే ఉన్న ఆయన ఇప్పుడు రోడ్డెక్కారన్నారు. కెసిఆర్ పర్యటించే ప్రాంతాల్లో బిజెపి నేతలను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
టిఆర్ఎస్ లో ఉంటే నిజమైన ఉద్యమకారులు, లేదంటే ఉద్యమ ద్రోహులు అంటారా? అని మండిపడ్డారు. కెసిఆర్ కు లెఫ్ట్, రైట్ లో ఉన్న నేతలు ఎవరో చూసుకుంటే మంచిదని హితవు పలికారు. బ్లాక్ మెయిలర్లు, కమిషన్లు తీసుకునే వాళ్ళు, రైల్వే స్టేషన్లలో పిక్ పాకెటర్లు టిఆర్ఎస్ లో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి బీజేపీ పురుడు పోస్తదని బండి సంజయ్ హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.