FbTelugu

బీజేపీ చిల్లర పార్టీ: ఈటల

హైదరాబాద్: బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి చిల్లర రాజకీయాలు చేస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం పై లేనిపోని చిల్లర ఆరోపణలు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

తెలంగాణలో కరోనా పరీక్షలు, మరణాల పై బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ.నడ్డా పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల పై బీజేపీ ఆరోపణలు చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరు చూసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

ఒక జాతీయస్థాయి నాయకుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం చిల్లరతనం అన్నారు. ఢిల్లీ స్థాయి నాయకుడు గల్లీ మాటలు మాట్లాడటం దురదృష్టకరమని విమర్శించారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్ కు కూతవేటు దూరంలో నిజాముద్దీన్ మర్కజ్ విషయాన్ని మీరు పట్టించుకోకపోతే,  మర్కజ్ కేసులు బండారాన్ని బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వమని ఆయన అన్నారు.

దేశంలో కరోనా విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రానికి, ప్రధానికి మద్దతుగా ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఈటల పునరుద్ఘాటించారు. విదేశీ వైరస్ కరోనా కాబట్టి అంతర్జాతీయ రవాణా బంద్ చేయాలని కోరిన మొదటి వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పనితీరును మీ కేంద్ర బృందాలు మెచ్చుకున్నాయని చురక అంటించారు.

కేంద్ర బృందాలు టీఆర్ఎస్  ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటే, వారిపై బీజేపీ రాష్ట్ర కమిటీ కేంద్ర ఆరోగ్య మంత్రికి  ఫిర్యాదు చేశాయన్నారు. బీజేపీ కి రాజకీయాలు తప్ప పేదల ప్రాణాలు కాపాడే ఆలోచన లేదన్నారు. 2లక్షల ఎన్95 మాస్కులు ఇచ్చారని, బిచ్చం లెక్క పీపీఈ కిట్లు పంపించారన్నారు. కరోనా పరీక్షా యంత్రాలు మేము కొనుగోలు చేస్తే  వాటిని కొలకత్తా కి తరలించారని ఆరోపించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు 14లక్షల ఎన్95 మాస్కులు, 10లక్షల పీపీఈ కిట్లు తెచ్చి సిద్దంగా ఉన్నారు. ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయొద్దని సూచించారు.

You might also like